వరుస మరణాలతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంటోంది.. 2023 ఏడాదిలో 3 నెలలు గడువకముందే కె. విశ్వనాథ్, జమున, వాణీ జయరాం, తారక రత్న, మలయాళీ యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్, టాలీవుడ్ కెమెరా మెన్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సతీష్ కౌశిక్, నటి మాధురి దీక్షిత్ తల్లి, ప్రముఖ మరాఠీ నటి భాగ్యశ్రీ మోటే సోదరి మధు మార్కండేయ, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సమీర్ ఖాఖర్ వంటి వారు కన్నుమూశారు..
తాజాగా మరో ప్రముఖ నిర్మాత ఇకలేరు అనే వార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్‌కి గురైంది.. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆనంద రావు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. ఆయన వయసు 57 సంవత్సరాలు.. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించగా.. తనికెళ్ల భరణి దర్శకత్వం వహించిన ‘మిథునం’ చిత్రాన్ని నిర్మించారు..
విజయనగరం జిల్లా రేగిడి మండలం, వావిలవలస గ్రామానికి చెందిన ఆనంద రావు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, వ్యాపార వేత్తగా స్థిరపడ్డారు.. సంఘ సేవకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. సాహిత్యమంటే ఎక్కువ మక్కువ ఉండడంతో కోటిగాడు పేరుతో పర్యావరణ హిత పద్యాలను రాసి ప్రచురించారు..
‘మిథునం’ వంటి ఫీల్ గుడ్ ఫిలింతో ప్రొడ్యూసర్‌గా తన అభిరుచిని చాటుకున్నారు.. ఈ సినిమా నంది అవార్డు గెలుచుకుంది.. ఆనంద రావు మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు..