సినిమా ఇండస్ట్రీలో దర్శకుల మార్కెట్ రోజురోజుకీ పెరుగుతున్నా, వారిని లాక్ చేసేసి తమ బ్యానర్‌కే పరిమితం చేసే నిర్మాతల హవా కొనసాగుతోంది. స్టార్ డైరెక్టర్లు స్వేచ్ఛగా ఏ బ్యానర్‌లోనైనా సినిమా చేసే రోజులు తగ్గిపోయాయేమో అనిపిస్తోంది. ఒకసారి స్టార్ డైరెక్టర్ హిట్ కొడితే, పెద్ద నిర్మాతలు వారిని ముందుగానే అడిగినంత అడ్వాన్స్‌లు ఇచ్చి లాక్ చేసేస్తున్నారు. ఎక్కడికీ వెళ్లకుండా తమ బ్యానర్‌కే పరిమితం చేస్తున్నారు. త్రివిక్రమ్‌ను (Trivikram) తీసుకుంటే, 2012లో వచ్చిన జులాయి (Julayi) నుంచి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ హారిక హాసిని క్రియేషన్స్‌లోనే వచ్చాయి.
అజ్ఞాతవాసి (Agnyaathavaasi) లాంటి డిజాస్టర్ వచ్చినా కూడా వదల్లేదు. ఇక కొత్తగా అల్లు అర్జున్‌తో (Allu Arjun) చేస్తున్న సినిమా కూడా ఇదే బ్యానర్‌లో ఉంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) అయితే దిల్ రాజు (Dil Raju) బ్యానర్‌కు పూర్తిగా అంకితమైపోయారు. ఆయన చేసిన 8 సినిమాల్లో 6 సినిమాలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో వచ్చాయి. కొత్త దర్శకులను లైన్‌లో పెడుతున్న రాజు, అనిల్‌ని మాత్రం వదలడం లేదు.
ఇక శేఖర్ కమ్ముల (Sekhar Kammula) లవ్ స్టోరీ (Love Story) నుంచి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLPలో అడుగుపెట్టి, ఇప్పుడు కుబేరా సహా మరికొన్ని ప్రాజెక్టులు అక్కడే చేస్తూ కొనసాగుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే మరో లెవెల్‌కి వెళ్లారు. మొదట కొరటాల శివతో (Koratala Siva) మొదలైన మైత్రి ఇప్పుడు సుకుమార్ ను (Sukumar) వడలట్లేదు. సుక్కు రంగస్థలం (Rangasthalam) నుంచి ఈ బ్యానర్‌లోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాను కూడా మైత్రి బ్యానర్‌లోనే తెరకెక్కిస్తున్నారు.
ఇదే బాటలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా టీ-సిరీస్ భూషణ్ కుమార్‌తో (Bhushan Kumar) కబీర్ సింగ్, యానిమల్ (Animal) చేశాడు. ఇప్పుడు స్పిరిట్ (Spirit), బన్నీ సినిమా కూడా ఇదే బ్యానర్‌లో ఉంది. మొత్తానికి టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లను వదిలిపెట్టకుండా లాక్ చేసే ట్రెండ్ బలంగా కనిపిస్తోంది. అడిగినంత రెమ్యునరేషన్ లేదంటే లాభాల్లో షేర్ అందిస్తూ కాంబినేషన్స్ ను కంటిన్యూ చేస్తున్నారు.