ఖడ్గం సినిమా గుర్తుందా…ఆ సినిమాలో రవి తేజ చెప్పిన ఫేమస్ డైలాగ్ గుర్తుందా?
ఒక్క చాన్స్…ఒకే ఒక్క చాన్స్ వస్తే ఇండస్ట్రీని కుమ్మేస్తా అంటూ తిరుగుతాడు. అయితే అది సినిమాలో పాత్ర మాత్రమే కాదు నిజ జీవితంలో ఎంతో మంది పడుతున్న వేదన. సినిమాపై పిచ్చి, అదే వాళ్ళ బాషలో ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఫుట్ పాత్స్ పై పడుకుంటూ, అనేకానేక స్టూడియోస్ చుట్టూ తిరుగుతూ ఒక్క చాన్స్ కోసం తిరిగిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారింది. షార్ట్ ఫిల్మ్స్ పుణ్యమా అంటూ ట్యాలెంటెడ్ దర్శకులు, టాలెంట్ ఉన్న కళాకారులు చాలా ఈజీగా దొరుకుతున్నారు. అవకాశాలు సైతం అంతే ఈజీగా రావడంతో తొలి సినిమాలతోనే హిట్ కొట్టి సినీ ప్రపంచానికి తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఇందులో కొందరు కమర్షియల్ దారిని నమ్ముకుంటే కొందరు పూర్తిగా తమ కధ, ఎంటర్‌టైన్‌మెంట్, ఫీల్ గుడ్ మూవీస్ ను నమ్ముకుంటూ దూసుకుపోతున్నారు. ఒక్కసారి ప్రస్తుతం ఉన్న యువ హీరోల సక్సెస్ స్టేటస్ వివరాలు చూస్తే…
తాజాగా సొగ్గాడే అంటూ మరోసారి మన్మధున్ణి రొమ్యాంటిక్ యాంగిల్ లో చూపించిన కళ్యాణ్ కృష్ణ మొదలు కొని, ఉయ్యాలా జంపాల అంటూ యువతను ప్రేమ ఊయల ఊగించిన వర్మ, లవ్లీ బోయ్ సుధీర్బాబు తో భలే మంచి రోజును తెరకెక్కించిన శ్రీరాం. తెలుగు మరచిపోతున్న నేటి యువతకు ఓనమాల పేరుతో అక్షరాలను పరిచయం చేసిన క్రాంతి మాధవ్, కామెడీ తో గిలిగింతలు పెట్టించి ఎంటర్ టైన్ మెంట్ ఎక్స్ ప్రెస్ ఎక్కించిన మేర్లపాక గాంధీ, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎందరో దర్శకులు తమ టాలెంట్ తో తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ లు అందుకుని తమ సత్తా చాటుకుంటున్నారు. గతంలో శివ సినిమాతో వర్మ ఎలా అయితే సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడో, అలాగే ఈ యువ దర్శకులు అందరూ తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా సక్సెస్ఫుల్ సినిమాలతో దూసుకుపోతున్నారు.