పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. నైజాం, ఓవర్సీస్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నూరు శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా ప్రదర్శించబడుతోంది. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకుడు కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు.
అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడకపోవడం గురించి జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ ఆడియో వైరల్ కావడం వల్లే త్రివిక్రమ్ సైలెంట్ గా ఉన్నారని కొంతమంది భావించారు. అయితే భీమ్లా నాయక్ సక్సెస్ మీట్ లో మాట్లాడిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. భీమ్లా నాయక్ మూవీని సాగర్ అర్థం చేసుకున్న విధానం బాగుందని త్రివిక్రమ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు డైరెక్షన్ చేయడానికి సాగర్ భయపడకూడదని నిర్మాతలు, తాను అతనికి అండగా నిలిచామని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. సాగర్ కు అవసరమైనవి తాము సమకూర్చామని సాగర్ ఇబ్బంది పడకూడదని భావించి తాము అతనికి దగ్గరగా ఉన్నామని త్రివిక్రమ్ కామెంట్లు చేశారు. షాట్ నచ్చని సమయంలో పవన్ కు చెప్పాలంటే తమ సాయం తీసుకోవాలని సూచించామని త్రివిక్రమ్ అన్నారు. సాగర్ కె చంద్ర భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలివేట్ కావాలనే భావనతో తాను ఆ ఈవెంట్ లో మాట్లాడలేదని త్రివిక్రమ్ అభిమానులతో చెప్పారని సమాచారం.
సాగర్ కె చంద్రకు ఈ సినిమా సక్సెస్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అయితే సాగర్ కు వెంటనే మరో స్టార్ హీరో ఛాన్స్ ఇస్తాడా? అంటే మాత్రం కచ్చితంగా అవునని చెప్పలేం. వకీల్ సాబ్ హిట్టైనా ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ తర్వాత సినిమా మొదలుకాలేదనే సంగతి తెలిసిందే.