మొసలి గురించి తెలుసా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? దాని గురించి, ఇప్పుడు మేం చెప్పబోయే వ్యక్తి గురించి ఓ కామన్ పాయింట్ ఉంది. అందుకే అడుగుతున్నాం. మీకు తెలిసిన విషయమే అయినా.. మళ్లీ చెబుతున్నాం. మొసలికి నీటిలో ఉంటే బలం, బయటకు వస్తే అంత బలం ఉండదు. అలా ఓ టాలీవుడ్ రైటర్ కమ్ దర్శకుడు ఆ మాటకొస్తే స్టార్ దర్శకుడు నీటిలో మొసలి లాంటివారా? ఏమో ఆయన కథల ఫలితాలు చూస్తే అలానే అనిపిస్తోంది.
మేం చెప్పిన ఆ రైటర్ కమ్ దర్శకుడు ఎవరో కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్. టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ అలియాస్ గురూజీ.. తన కథలతో పక్క ఇండస్ట్రీలో విజయాలు అందుకోలేరా? ఇదే ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇదేదో ఒక సినిమానో, రెండు సినిమాలో చూసి అడుగుతున్న మాట కాదు. వరుసగా ఆయన కథలు పక్క పరిశ్రమల్లో పరాజయం పాలవ్వడం చూసి అడుగుతున్న ప్రశ్న. కావాలంటే మీరే చూసుకోండి అర్థమైపోతుంది.
మన తెలుగు సినిమాలు ఇటు తమిళంలోకి, అటు బాలీవుడ్‌లోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో హైప్ అయితే తెచ్చుకుంటున్నాయి కానీ.. వసూళ్లు మాత్రం నై నై అంటున్నాయి. రచయితగా త్రివిక్రమ్ రాసిన బెస్ట్ కథల్లో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఒకటి. ఈ సినిమాలో తమిళంలో విజయ్ హీరోగా ‘వశీకర’ అనే పేరుతో వచ్చింది. ఆ సినిమా అక్కడ పెద్ద డిజాస్టర్. దర్శకుడిగా మారాక త్రివిక్రమ్ చేసిన ‘అతడు’ను హిందీలో బాబీ డియోల్ హీరోగా ‘ఏక్: ది పవర్ ఆఫ్ వన్’గా రీమేక్ చేస్తే ఫ్లాప్ అయింది. అలాగే ‘జులాయి’ సినిమాను తమిళంలో ‘సాగసం’ పేరుతో తీస్తే తుస్‌మంది.
‘అత్తారింటికి దారేది’ సినిమాను ‘వందా రాజాదా వరువేన్’ పేరుతో శింబు రీమేక్ చేశారు. ఈ సినిమా కూడా కష్టంగా ఆడింది. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాను హిందీలో ‘షెజాదా’ పేరుతో రీమేక్ చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దీంతో ఆయన కథలు అలా తీసుకెళ్లిపోతే విజయం కష్టం అని తేలింది. దానికి ఆయన శైలిలో చిత్రీకరణ, మాటలు పడాల్సిందే అని తేలిపోయింది. తొలుత నుండి కథ కంటే దానికి అద్దే మెరుగులు మీదే ఆయన ఎక్కువ దృష్టి పెడతారు అని టాక్. ఇప్పుడు రీమేక్‌లు మేకులుగా మారి గుచ్చుతుండటంతో మరోసారి విషయం అర్థమైంది.