డిస్నీ నుంచి సినిమా వస్తుందంటే విజువల్స్ వేరే లెవెల్ లో ఉంటాయని ఫిక్స్ అవుతాం. కానీ ‘ట్రాన్: ఏరిస్’ విషయంలో ఆ ఊహలన్నీ తలకిందులయ్యాయి. అక్టోబర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ బొమ్మ, బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఏకంగా 1000 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చి డిస్నీకి కోలుకోలేని దెబ్బేసింది. అయితే ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మేకర్స్ ఒక విచిత్రమైన ప్లాన్ వేశారు.
TRON: ARES
సాధారణంగా థియేటర్లో ప్లాప్ అయిన సినిమా వెంటనే ఓటీటీలో ఫ్రీగా వచ్చేస్తుందని ఆడియన్స్ వెయిట్ చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో ఆ ఛాన్స్ లేదు. డిసెంబర్ 2 నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నా, సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లకు ఇది ఉచితం కాదు. దీన్ని ‘వీడియో ఆన్ డిమాండ్’ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. అంటే సినిమా చూడాలంటే ప్రత్యేకంగా డబ్బులు కట్టి రెంట్ తీసుకోవాల్సిందే.
అసలు షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ రెంట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. విదేశాల్లో ఈ సినిమాను ఒక్కసారి చూడాలంటే మన కరెన్సీలో దాదాపు రూ. 1,700 నుంచి రూ. 2,600 వరకు చెల్లించాలట. ఒక ప్లాప్ సినిమా కోసం ఇంత రేటు పెట్టి ఎవరు చూస్తారు? అని నెటిజన్లు అవాక్కవుతున్నారు. అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో డబ్బులు కడితేనే యాక్సెస్ దొరుకుతుంది.
థియేట్రికల్ రన్‌లో వచ్చిన భారీ నష్టాన్ని కవర్ చేసుకోవడానికే నిర్మాణ సంస్థ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బ్యాక్ డ్రాప్‌లో నడిచే కథ కాబట్టి, టెక్నాలజీ లవర్స్ ఎలాగైనా డబ్బులు కట్టి చూస్తారని వాళ్లు నమ్ముతున్నారు. జారెడ్ లెటో నటన, గ్రాఫిక్స్ కోసం కొంతమంది ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏ ఓటీటీలోనూ ఈ సినిమా ఫ్రీగా దొరకదు. 2026 జనవరిలో ఫిజికల్ డిస్క్ రిలీజ్ చేసే ప్లాన్ ఉంది. బహుశా అప్పుడే రెగ్యులర్ ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చే ఛాన్స్ ఉంది.
