సినిమాలకు పెద్ద సమస్య పైరసీ అని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాతి స్థానం లీక్‌లకు ఇవ్వొచ్చు. ఇటీవల కాలంలో సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలకు లీక్‌ల బెడద ఎక్కువైంది. సెట్‌లో ఏదో మూల నుండి మొబైల్ కెమెరాలో షూట్ చేసి కీలకమైన సీన్ బయటకు విడుదల చేసేస్తున్నారు. ఇదో రకం. ఇక్కడ మరో రకం కూడా ఉంది. అది ఒరిజినల్ ఫుటేజ్‌ను బయటకు లీక్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఇబ్బంది పడ్డ చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో ‘కళావతి’ సాంగ్ విడుదలకు ముందే లీక్ అయ్యింది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ‘కళావతి’ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేద్దాం అనుకుంది. అయితే దీన్ని ముందుగానే లీక్ చేసేశారు లీక్ వీరులు. ఈ వ్యవహారంలో అప్‌డేట్ వచ్చింది. లీక్‌కు కారణమైన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. పాట లీక్ కావడంతో రంగంలోకి దిగిన నిర్మాతల టీమ్ పాటను లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారని తెలుస్తోంది. పాట లీక్ వ్యవహారంలో కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపడుతున్నారు.
పాట లీకేజీ వ్యవహారంలో… సంగీత దర్శకుడు తమన్ చాలా భావోద్వేగానికి గురయ్యారు. మనసులో చాలా బాధగా ఉంది. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. సుమారు ఆరు నెలలు ఈ పాట కోసం కష్టపడ్డాం. ఈ పాట షూట్ చేసినప్పుడు ఎనిమిది మందికి కరోనా వచ్చింది. అయినా సరే మేమంతా కలిసి మంచి పాటను సిద్ధం చేయాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేశాం. కానీ, ఒకడు అంత ఈజీగా దీన్ని లీక్ చేసేసి.. ఆన్‌లైన్‌లో పెట్టేశాడు అని బాధపడ్డాడు తమన్.
వాడికి పని ఇస్తే ఈ పని చేస్తాడనుకోలేదు. గుండె తరుక్కుపోతుంది. కోపం, బాధ ఉప్పొంగుకొస్తున్నాయి. దీన్ని ఇలాగే వదిలేసి ఎలా ముందుకు సాగిపోవాలో అర్థం కావడం లేదు. గుండె ముక్కలైనట్లు ఉంది. సుమారు వెయ్యి మంది కష్టం ఈ పాట. అభిమానులు నన్ను క్షమించండి అంటూ తమన్ చెప్పుకొచ్చారు. మరోవైపు పాట లీక్ కావడంతో 14వ తేదీన రిలీజ్ చేయాల్సిన ‘కళావతి’ పాటను ఆదివారం విడుదల చేసేశారు.