‘విశ్వరూపం 2’ తర్వాత కమల్ హాసన్ నుండి వచ్చిన మూవీ ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. అబ్బో ఈ దర్శకుడు మామూలు టాలెంటెడ్ కాదు. భవిష్యత్తులో మరో రాజమౌళి, ప్రశాంత్ నీల్ లా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదుగుతాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఈయన తెరకెక్కించిన ‘ఖైదీ’ చిత్రానికి ఎంత మంది కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారో తెలుసుగా.! ‘మాస్టర్’ సినిమా సోసోగా ఉన్నా అది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది. అలాంటి దర్శకుడు కమల్ హాసన్ తో ఓ సినిమా చేస్తున్నాడు అంటే అది ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఎందుకంటే కమల్ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ మూవీ. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అని టీజర్ చూసినప్పుడే అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ రోజుల్లో కమల్ ను యాక్షన్ హీరోగా ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కట్ చేస్తే రిలీజ్ తర్వాత ఆ అనుమానాలు అన్నీ పటాపంచలు అయిపోయాయి. ఒక్క కమల్ అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు లోకేష్.
ఈ చిత్రంలో అన్ని పాత్రలు హైలేట్ అనిపించుకున్నాయి. ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది.థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా వెంటాడుతుంది. అందరినీ బాగా సర్ప్రైజ్ చేసిన పాత్ర మాత్రం ఏజెంట్ టీనా అనే చెప్పాలి. విక్రమ్ ఇంట్లో ఓ పని మనిషి లా ఉండే ఈమె ఓ ఏజెంట్ అన్న సంగతి తెలిసి థియేటర్లో ప్రతీ ఒకరు విజిల్స్ వేశారు.క్లైమాక్స్ లో ఈమె చేసిన ఫైట్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఫహాద్ ఫాజిల్ గ్లాసు కింద పడేసినప్పుడే ఈమె షార్ప్ గా పట్టుకోవడం..
అది పిల్లాడి కోసం అని దర్శకుడు డైవర్ట్ చేసిన తీరు.. అబ్బో మాములు టేకింగ్ కాదు అది. అయితే ఈ టీనా ఎవరు? చాలా మంది ఈమె కొత్త నటి అనుకుంటున్నారు. కానీ చాలా కాలం నుండీ ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం :
1) ఈమె అసలు పేరు వాసంతి. ఈమె చెన్నైలోనే పుట్టి పెరిగింది. ఈమె ఓ గ్రూప్ డాన్సర్. దినేష్ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా చేసింది.
2) త్రిష, నయనతార, అనుష్క, అమీ జాక్సన్ వంటి హీరోయిన్లు చాలా మందికి ఈమె డాన్స్ ట్రైనర్ గా వ్యవహరించింది. ఎక్కువగా తమిళ సినిమాలకే పనిచేస్తుంటుంది.
3) ఈమె 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతుంది. 1992 లో ఈమె కెరీర్ ను ప్రారంభించింది.
4) విజయ్ – లోకేష్ కాంబినేషన్లో వచ్చిన ‘మాస్టర్’ చిత్రంలో ‘వాతి’ పాటకి’ ఈమె పనిచేసింది.
5) వాతి పాటకి ఈమె పని చేసిన విధానం నచ్చి లోకేష్ ‘విక్రమ్’ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు.
6) లోకేష్ చిత్రం కోసం వాసంతి 16 రోజులు షూటింగ్లో పాల్గొందట.
7) సినిమాలో ఆమె చేసిన ఫైట్ ను.. 5 రోజులు చిత్రీకరించారట.
8) ఏదో చిన్న పాత్ర కథా అని ఈమె ఈ చిత్రంలో నటించిందట. కానీ ఇంత ప్రాముఖ్యత కలిగిన పాత్రని ఇస్తారు అని ఆమె ఊహించలేదట.
9) ‘విక్రమ్’ విడుదలైన రోజు నుంచి వాసంతికి బోలెడన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఆమె పాత్రకి ఇంత గొప్ప పేరు వస్తుందని ఆమె ఊహించలేదట. కమల్ హాసన్ వంటి గొప్ప నటుడితో కలిసి నటించే అవకాశం దక్కినందుకు ఆమె చాలా సంతోషిస్తుంది.
10) విక్రమ్ తర్వాత ఈమెకు చాలా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయట. కానీ ఈ రేంజ్ పాత్రలు దక్కడం లేదట. ఒకసారి ‘ఏజెంట్ టీనా’ లాంటి పాత్ర చేసిన తర్వాత ఈ స్థాయి పాత్రలు చేయకపోతే.. వెంటనే ఫేడౌట్ అయిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు అని వాసంతి చెప్పుకొచ్చింది. నటి అయినప్పటికీ కొరియోగ్రాఫర్ గా ఈమె కొనసాగడం ఆపనని ఈమె తెలియజేసింది.