నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన సినిమాల్లో ‘నిప్పురవ్వ’ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలా అని ఇదేమి బ్లాక్ బస్టర్ మూవీ కాదు. కానీ ఈ ప్రాజెక్టు ప్రారంభమవ్వడమే ఊహించని సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా దివ్య భారతిని అనుకున్నారు. ‘బొబ్బిలి రాజా’ చిత్రంతో ఆమెకు క్రేజ్ పెరిగింది.. వరుస ప్రాజెక్టులకు సైన్ చేసింది. దాంతో ఈ ప్రాజెక్టు చేయడానికి ఆమె ముందుకు రాలేదు.
దాంతో ఈ చిత్ర నిర్మాత అయిన విజయశాంతే హీరోయిన్ గా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. బాలయ్య- విజయశాంతి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాల్లో చాలా వరకు విజయం సాధించినవే. పైగా కోదండరామిరెడ్డి దర్శకుడు. పరుచూరి బ్రదర్స్ రైటర్స్. కాబట్టి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఓ విషయంలో బాలయ్య- విజయశాంతి ల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయట. ‘కర్తవ్యం’ తర్వాత విజయశాంతి ఇమేజ్ పెరగడంతో ఆమె ఈ కథలో మార్పులు కోరిందట.. అందుకే వీరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి.
నిజానికి ‘నిప్పురవ్వ’ కి మొదట విజయశాంతి నిర్మాత.. ఆ తర్వాత బాలయ్య కూడా నిర్మాణ భాగస్వామిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడే అసలు ఇష్యు మొదలైంది. ఇక చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకకి ముఖ్య అతిధులుగా రజినీకాంత్, మోహన్ లాల్ లు హాజరయ్యారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే… యాక్షన్ ఎపిసోడ్స్ లో ఓ వ్యక్తి మరణించినట్టు తెలుస్తుంది. ఇంకో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
అయితే ఇది అబద్దం అంటూ చిత్ర బృందం కొట్టిపారేసింది. ఆ టైంకే ఆ ముగ్గురి ఫ్యామిలీస్ పెద్ద ఎత్తున రచ్చ చేసాయి. ఇక బడ్జెట్ మొదట అనుకున్నదానికంటే 3 రెట్లు ఎక్కువ పెరిగిందట. ఈ చిత్రం షూటింగ్ అనేక సార్లు ఆగిపోతూ రావడంతో మేకింగ్ కాస్ట్ పెరిగిపోయి ఫైనల్ గా రూ.3 కోట్ల బడ్జెట్ అయ్యిందని తెలుస్తుంది. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ముందుగా బప్పీ లహరిని ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కానీ మధ్యలో అతనికి వేరే పెద్ద ఆఫర్ వచ్చింది. దాంతో అతను ఆ ప్రాజెక్టుకి మళ్ళాడు.
ఇక షూటింగ్ కు వచ్చిన గ్యాప్ లో బాలయ్య ‘బంగారు బుల్లోడు’ అనే చిత్రం షూటింగ్ ను ఫినిష్ చేసాడు. రవిరాజా పినిశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. దీని తర్వాత వెళ్లి ‘నిప్పురవ్వ’ షూటింగ్ ను ఫినిష్ చేసాడు. విచిత్రం ఏంటి అంటే.. ‘నిప్పురవ్వ’ ‘బంగారు బుల్లోడు’ చిత్రాలు 1993 సెప్టెంబర్ 3 నే రిలీజ్ అయ్యాయి. బాలయ్య ఫ్యాన్స్ కూడా దీనికి బిత్తరపోయారు అనే చెప్పాలి. అయితే ఈ రెండు చిత్రాల్లో ‘నిప్పురవ్వ’ కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఫుల్ రన్లో ‘బంగారు బుల్లోడు’ చిత్రం ‘నిప్పురవ్వ’ కంటే కూడా ఎక్కువ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.