నందమూరి బాలకృష్ణ కూడా తన తండ్రి దివంగత స్టార్ హీరో, ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారిలా అన్ని రకాల పాత్రలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం రాత్రి పడుకునే ముందు తన తండ్రి సినిమాలు చూస్తూ పడుకుంటారు. ఇదే విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పౌరాణిక చిత్రాలకి పెట్టింది పేరు నందమూరి ఫ్యామిలీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ కి ఉన్న ఆ ఇంట్రెస్ట్ ‘పాండురంగడు’ అనే చిత్రం చేయడానికి కూడా దోహదపడింది.
కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో అలరించారు బాలకృష్ణ. ఇది కూడా నందమూరి తారక రామారావు నటించిన `పాండురంగ మహాత్మ్యం` (1957) స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమే. శ్రీ కృష్ణుడిగా, పుండరీక రంగనాథునిగా బాలయ్య ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు.నాగార్జునతో ‘శ్రీరామదాసు’ అనే చిత్రాన్ని చేసి సూపర్ హిట్ అందుకున్న దర్శకేంద్రుడు బాలయ్య వంటి పౌరాణిక చిత్రాల్లో ఆరితేరిన హీరోతో సినిమా చేస్తున్నాడు అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి.
‘పాండురంగడు’ మూవీ పై కూడా అలాగే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమాలో భక్తి కంటే రక్తి ఎక్కువగా ఉందనే కామెంట్లు వినిపించాయి. స్నేహ, టబు ,అర్చన, మేఘనా నాయుడు వంటి భామలు నటించిన ఈ చిత్రంలో గ్లామర్ కు లోటు ఉండదు. కానీ సగటు ప్రేక్షకుడిని అలరించే అంశాలు తక్కువయ్యాయి. దీంతో సినిమా ప్లాప్ అయ్యింది. నిజానికి ఈ చిత్రంలో హీరోగా రవితేజ నటించాలి.కె.రాఘవేంద్ర రావు గారు ముందుగా ఈ చిత్రం కథని రవితేజకే వినిపించారు.
కానీ రవితేజ ‘నా మొహానికి పాండురంగడు సినిమా సెట్ అవుతుందా గురూజీ’ అంటూ తిరస్కరించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రవితేజ డెసిషన్ సరైనదే.. అందుకే ప్లాప్ నుండీ బయటపడ్డాడు.అయితే ఈ చిత్రానికి కీరవాణి అందించిన బాణీలు అందరినీ అలరించే విధంగా ఉంటాయి. 2008వ సంవత్సరం మే 20న ఈ చిత్రం విడుదలైంది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది.