చెన్నైలో ‘సేవ్‌శక్తి’ పేరిట ఓ ఎన్జీవో ఉంది తెలుసా? ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ ఎన్జీవోను నిర్వహిస్తూ ఉంటుంది. అయితే దీన్ని ఏర్పాటు చేయడం వెనుక ఓ కారణం ఉందట. ఇటీవల ఈ విషయాన్ని వరు అలియాస్ వరలక్ష్మి చెప్పుకొచ్చింది. ఆ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు వెనుక ఆమె గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన కష్టాలు ఉన్నాయట. వరు చిన్నతనంలో లైంగికదాడికి గురైందట. అంతేకాదు హీరోయిన్ అయ్యాక కూడా ఓ టీవీ అధినేత ఆమెతో అసభ్యంగా మాట్లాడాడట.
‘సేవ్ శక్తి’ ఎన్జీవో ద్వారా గృహహింస, అత్యాచార బాధితుల కోసం పోరాడుతోంది వరలక్ష్మి. ఇలాంటి వ్యవహారాల్లో లాయర్లను పెట్టి వారి తరపున కేసులు వేయించి న్యాయం జరిగేలా చూస్తోంది వరలక్ష్మి. అక్కడితో ఆగకుండా గృహ హింస, అత్యాచర బాధితులకు ఉద్యోగాలు ఇప్పించి భవిష్యత్తుకు బాసటగా నిలుస్తోంది. వీటితోపాటు జంతుసంరక్షణలో భాగంగా చెన్నైలోని మూడు వేల కుక్కలకు రోజూ ఆహారం అందిస్తోంది. మానసిక ఆందోళనలు ఉన్నవారికి నిపుణుల సేవలు అందిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాలను వరలక్ష్మి తన తల్లికే అప్పగించింది.
ఒక తమిళనాడు అనే కాకుండా.. మొత్తం దక్షిణాది వ్యాప్తంగా వరలక్ష్మి స్వచ్ఛంద సంస్థ సేవలు అందిస్తోంది. ఈ ఎన్జీవో పెట్టడానికి కారణమేంటి అని చూస్తే… చిన్నతనంలోనే ఓసారి వరు మీద లైంగిక దాడి జరిగిందట. ఇంట్లో అమ్మానాన్నలతో చెప్పాలో, చెప్పకూడదో తెలియని వయసులో ఆ దాడి జరిగిందట. దీంతో ఆ రోజుల్లో భయపడి చెప్పలేదట. హీరోయినయ్యాక ఓ టీవీ అధినేత వరలక్ష్మితో ‘నాతో గడుపుతావా’ అని అన్యాపదేశంగా అన్నాడట.
దానికి వరు కోపంతో… ‘పోరా బయటకు’ అని చేయి చేసుకోబోయిందట. అందుకే సమాజంలో పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పడం మంచిది అనేది వరలక్ష్మికి అనిపించిందట. మన దగ్గర పిల్లల దగ్గర పెద్దవాళ్లు ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం లేదు. అందుకే తనకు జరిగింది చెబితేనైనా.. వాళ్ల పిల్లలకు అవగాహన కల్పిస్తారని బయటకు చెబుతున్నా అని తన ఆలోచనను వెలిబుచ్చింది.