రాజమౌళి మహేష్ బాబు ‘వారణాసి’ (SSMB29) టైటిల్ రివీల్ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా జరిగిందో, ఇప్పుడు దాని ఖర్చు గురించి ట్రేడ్ వర్గాల్లో అంతకుమించిన చర్చ నడుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో 130 అడుగుల భారీ స్టేజ్, ఎల్ఈడీ స్క్రీన్లు, గ్లోబల్ లైవ్ స్ట్రీమింగ్.. ఈ సెటప్ చూసి, ఈవెంట్ ఖర్చు సుమారు 15-16 కోట్లు అయ్యి ఉంటుందని కొందరు, కాదు 10 కోట్లేనని మరికొందరు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ‘ఖర్చు’ కాదు, జక్కన్న వేసిన ‘బిజినెస్’ ప్లాన్ అనే కొత్త టాక్ తెరపైకి వచ్చింది.
రాజమౌళి ఈ ఈవెంట్‌ను ఒక ‘గ్లోబల్ లాంచ్’గా ప్లాన్ చేశారు. ఇది సినిమా ప్రమోషన్ మాత్రమే కాదు, ఇదొక ‘రెవెన్యూ మోడల్’. ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కుల కోసం జియో హాట్‌స్టార్ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించిందని టాక్. గతంలో ఈ డీల్ 50 కోట్లు అని ప్రచారం జరిగినా, అందులో నిజం లేకపోయినా, డీల్ మాత్రం చాలా పెద్దదనేది వాస్తవం. జక్కన్న తన ఈవెంట్‌కు పెట్టిన ఖర్చును, ఈ స్ట్రీమింగ్ డీల్‌తో లాభాలతో సహా ముందే వెనక్కి తెచ్చుకున్నారని అంటున్నారు.

ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రమే కాదు, లైవ్ టెలికాస్ట్ మధ్యలో వచ్చిన యాడ్స్ ద్వారా కూడా మేకర్స్‌కు భారీ ఆదాయం సమకూరిందని సమాచారం. కేవలం ఈ యాడ్స్ ద్వారానే 5 కోట్లకు పైగా ఆదాయం వచ్చి ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే, జక్కన్న తన ఈవెంట్‌కు పెట్టిన 15 కోట్ల (అంచనా) ఖర్చును, కేవలం యాడ్స్, స్ట్రీమింగ్ రైట్స్‌తోనే కవర్ చేసి, లాభాల్లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది.

సాధారణంగా, నిర్మాతలు సినిమా ప్రమోషన్ల కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కోట్లల్లో ఖర్చు చేస్తారు. అది వాళ్లకు పెట్టుబడే. కానీ రాజమౌళి, ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేశాడు. ఏకంగా ‘టైటిల్ రివీల్’ ఈవెంట్‌నే ఒక లాభదాయకమైన వ్యాపారంగా మార్చి చూపించాడు. ఇది ఇండియన్ సినిమా ప్రమోషన్స్‌లో ఒక కొత్త బెంచ్‌మార్క్. ఈవెంట్ ఖర్చు ఎంతైనా, దానికి రెట్టింపు రాబడిని జక్కన్న ముందే ప్లాన్ చేశారు.
