రీమేక్ సినిమా అంటే.. ఒరిజినల్‌లో వచ్చిన కొన్ని రోజులకే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. లేదంటే మహా అయితే ఓ సంవత్సరం పట్టొచ్చు. కానీ ఏడేళ్ల తర్వాత ఓ సినిమా రీమేక్ అవుతోంది అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఒరిజినల్ కథలో విషయం బాగుండాలి, లేదంటే ఆ రీమేక్ కోసం ఇక్కడ ఎక్కవమంది వెయిట్ చేస్తుండాలి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. అదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పుడు ఇదే సినిమా బాలీవుడ్‌లో కూడా తెరకెక్కుతోంది.
విజయ్ – అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘తెరి’. అందులో విజయ్ పోలీసు అధికారిగా అదరగొట్టాడు. అదే సినిమా తెలుగులో ‘పోలీసు’ అనే పేరుతో థియేటర్లలో విడుదలైంది. ఆ సమయంలో టైటిల్‌తో కాస్త ఇబ్బందిపడి.. వైరల్ కూడా అయ్యింది. అయితే ఆ సినిమాకు మన దగ్గర సరైన ఫలితం రాలేదు. ఇప్పుడు అదే సినిమాను ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా తీస్తున్నారు అని అంటున్నారు. అయితే ఈ సినిమా రీమేక్ అనే విషయం మాత్రం టీమ్ అధికారికంగా చెప్పడం లేదు.
ఒరిజినల్ వెర్షన్ నుండి ప్లాట్‌ను తీసుకొని… వీలైనంతవరకు పోలికలు రాకుండా హరీష్ శంకర్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. అందుకే ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో ఈ వివరాలు, పోలికలు అస్సలు కనిపించలేదు అని అంటున్నారు. ఇప్పుడు అదే సినిమాను హిందీలోకి తీసుకెళ్తున్నారని సమాచారం. అయితే అక్కడ కొత్త దర్శకుడు కాకుండా తమిళంలో చేసిన అట్లీనే ఈ సినిమా కూడా చేస్తారట. దీని కోసం బాలీవుడ్‌లో (Varun Dhawan) వరుణ్ ధావన్ ఓకే అయ్యారని టాక్.
అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా పూర్తవ్వగానే అట్లీ తమిళంలో ఓ సినిమా చేస్తారు అని అంటున్నారు. దీని తర్వాత ‘తెరి’ హిందీ రీమేక్ ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా కొత్తదేం కాదు. అంటే ‘తెరి’ కొత్తది కాదు అని మా మాట. 1990లో వచ్చిన విజయ్ కాంత్ ‘క్షత్రియుడు’ స్ఫూర్తితో ఈ సినిమా తీశారు.