స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేయడం ఇప్పుడు కొత్తేం కాదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా సరైన విజయం రావడం లేదు. ఇప్పుడు ఇదే కోవలో పాన్ ఇండియా సినిమాతో రిలీజ్‌కు రెడీ అయ్యాడు వరుణ్ తేజ్. మెగా ప్రిన్స్‌గా కూల్ ట్యాగ్ లైన్ ఉన్నా… ప్రయోగాలకు ముందుంటాడు. అలా ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ వస్తోంది. అయితే హిందీ వెర్షన్‌కి కూడా వరుణే డబ్బింగ్ చెప్పాడట.
ఈ సినిమా కోసం చాలా మంది ఎయిర్‌ఫోర్స్ అధికారుల్ని కలిశామని చెప్పిన వరుణ్… నిజమైన ఎయిర్ బేస్‌కి వెళ్లి షూటింగ్ చేశామని చెప్పాడు. వాళ్లు చెప్పే కథలు, ఆపరేషన్ల గురించి వింటూ స్ఫూర్తి పొందాడట. ఫైటర్ జెట్‌లో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా తిరగాలి వాళ్ల నుండే తెలుసుకున్నానని చెప్పాడు. తన పాత్ర కోసం సన్నద్ధం కావడం ఒకెత్తైతే, ఈ సినిమా చిత్రీకరణ సాగిన విధానం మరో ఎత్తు అని చెప్పాడు.
ఒక దశలో తామూ భారతీయ వైమానిక దళంలో ఓ భాగం అన్నట్టుగా అనిపించిందట. ఫోన్లు లేకుండా చిత్రీకరణలో పాల్గొనడం బాగుండేదట. పనిపైనే ధ్యాస పెడుతూ షూటింగ్‌ను ఆస్వాదించారట. ఎంతగా అంటే ఈ సినిమా కోసం పెళ్లి ముహూర్తాన్నీ మార్చుకుని, సినిమా పూర్తయ్యాకే పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు వరుణ్. ఇక ఎలాంటి పాత్ర చేయాలని ఉంది అని అడిగితే… సగటు మాస్ హీరో చెప్పే మాట అన్నాడు (Varun Tej) వరుణ్. అదే పోలీసు.
అలాగే మరో ప్రేమకథ ఎప్పుడు అంటే… ‘ఫిదా’ సినిమాకు ముందు ప్రేమకథ చేయకూడదుకున్నానని, దర్శకుడు శేఖర్ కమ్ముల కథ చెప్పడం, ఇలాంటి సినిమా మిస్ చేసుకోకూడదని అనిపించి ఓకే చేసేశాను అని చెప్పారు. అయితే పక్కా పోలీస్ కథ ఒకటి చేయాలని ఉంది అని చెప్పాడు వరుణ్. ఈ మేరకు కథలు వింటున్నాడట. ఇక ప్రస్తుతం చేస్తున్న ‘మట్కా’ ఓ రివెంజ్ కథ అని… ఈ సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నానని చెప్పాడు.