మార్చి 27న టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. శిల్పాకళావేదికలో జరిగిన ఈ వేడుకకు వరుణ్ తేజ్, మెహర్ రమేష్, బాబీ, చిరంజీవి సోదరి మాధవి, జానీ మాస్టర్ లాంటి వాళ్లు హాజరయ్యారు. ఈ వేడుకలో ఎంతోమంది మెగాఫ్యాన్స్ సందడి చేశారు. ఈ క్రమంలో నటుడు వరుణ్ తేజ్.. రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ ని విమర్శించే వాళ్లకు వరుణ్ తేజ్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
రామ్ చరణ్ తో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ చిన్నప్పటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు వరుణ్ తేజ్. చిరంజీవి గారిలో మెచ్యూరిటీ, కళ్యాణ్ బాబు గారిలో ముక్కుసూటితనం ఈ రెండూ కలబోసుకుంటే రామ్ చరణ్ అంటూ మెగాభిమానులను హూషారెత్తించారు వరుణ్ తేజ్. ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీన్ పై రామ్ చరణ్ ని చూస్తున్నట్లు అనిపించలేదని.. సాక్ష్యాత్తు అల్లూరి సీతారామరాజుని చూస్తున్నట్లు అనిపించిందని చెప్పారు. తన స్పీచ్ చివర్లో వరుణ్ తేజ్ ఇచ్చిన వార్నింగ్ చర్చనీయాంశంగా మారింది.
‘చరణ్ అన్నను ఎవరన్నా నోరెత్తి ఒక మాట మాట్లాడాలంటే.. మీరందరితో(అభిమానులు) పాటు నేనూ అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి. ఆ తర్వాత చరణ్ అన్నతో మాట్లాడొచ్చు’ అంటూ హెచ్చరించారు. అసలు వరుణ్ తేజ్ ఎవరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సక్సెస్ అందుకున్నారు రామ్ చరణ్. రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా కనిపించారు.
తెరపై వీరిద్దరి పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది ఈ సినిమా. అయితే కొందరు మాత్రం ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారంటూ తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.