‘మట్కా’… ఇప్పుడంటే ఈ పేరు చెబితే వరుణ్ తేజ్ సినిమా గుర్తొస్తుంది కానీ.. ఉత్తరాంధ్ర వాసులకు ఈ పేరు సుపరిచితమే. అయితే ఇప్పటి తరానికి కాదు. 50 నుండి 90ల కాలంలో ఈ పేరుతో ఉత్తరాంధ్రలో పెద్ద దందానే జరిగేది. ఆ పేరు ఎత్తితే రెండు రకాల మనుషులు గుర్తొస్తుంటారు. ఒకరు అమాంతం ధనవంతులు అయిపోయిన కొందరు, మరొకరు లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని ఆర్థికంగా చితికిపోయిన చాలామంది. ఇప్పుడు అదే కథతోనే ‘మట్కా’ తెరకెక్కుతోంది.
దేశాన్ని కదిలించిన యథార్థ సంఘటనల ఆధారంగా ‘మట్కా’ తెరకెక్కుతోందని సినిమా టీమ్ ఇటీవల ప్రకటించింది. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుండి సినిమా టీమ్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ వీడియోకు ‘ఫస్ట్ బ్రాకెట్’ అని పేరు పెట్టారు. ఇక్కడ బ్రాకెట్ అంటే ‘మట్కా’ గేమ్‌లో ఎక్కువగా వాడే పదం. ఇది జూదం తరహాలోన ఉంటుంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో రూపొందించిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సినిమాలో ప్రధాన సన్నివేశాలు అన్నీ ఇక్కడే షూట్ చేస్తారని చెబుతున్నారు. ఇందులో వరుణ్‌తేజ్ 80వ దశకం నాటి లుక్‌లో కనిపించాడు. 24 ఏళ్లపాటు సాగే ఈ కథలో వరుణ్‌తేజ్ నాలుగు గెటప్‌లలో కనిపిస్తాడని చెబుతున్నారు. 1958 నుండి 1982 మధ్య సాగే కథ ఇదని తెలుస్తోంది. ఈ క్రమంలో వరుణ్ (Varun Tej) నాలుగు భిన్న గెట్స్‌లో కనిపిస్తాడట.
ఇక ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తారట. వైరా ఎంటర్‌టైన్మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తారట. మంచి సోలో డేట్ కోసం టీమ్ చూస్తోంది అని అంటున్నారు. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఆ మాత్రం తప్పదు అని అంటున్నారు.