‘అక్కడ లేని సీక్వెల్ ఇక్కడా..’ అంటూ ఇటీవల అందరూ చర్చించుకుంటున్నారు. ఆఁ అవును ‘వకీల్ సాబ్’ సీక్వెల్ గురించి మేం చెబుతున్నది. బాలీవుడ్, కోలీవుడ్‌లో ఈ సినిమా విజయం సాధించినా… అక్కడ సీక్వెల్ ప్రయత్నాలు చేయలేదు. మామూలుగా హిట్ సినిమాకు సీక్వెల్ అంటే ముందుండే బాలీవుడ్ కూడా ఈ దిశగా ఆలోచించలేదు. అయితే మరి తెలుగులో ఎందుకు? అనే ప్రశ్న అందరికీ ఉంది. ఈ విషయంలో దర్శకుడు వేణు శ్రీరామ్ తాజాగా స్పందించారు. సీక్వెల్ గురించి వివరంగా చెప్పుకొచ్చారు. ‘వకీల్‌సాబ్’ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన వేణు శ్రీరామ్‌కు లేదట.
అయితే సినిమా విడుదలయ్యాక… అభిమానులు, సన్నిహితులు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారట. వకీల్ సాబ్ అంటే ఎవరో , ఏం చేస్తారు, ఆయన స్వభావం ఏంటి అనేది ఇప్పుడు జనాలకు బాగా తెలిసింది. అంతగా సినిమాలో పాత్రను ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో ఈ కథను కొనసాగించి కొత్త సబ్జెక్ట్ రెడీ చేసుకుంటే సీక్వెల్ చేయొచ్చు అని వేణు శ్రీరామ్ అన్నారు. అంటే ఆలోచన ఉన్నట్లే కదా. ఆ మాటకు కూడా వేణు శ్రీరామ్ సమాధానమిచ్చారు. ఒకవేళ ‘వకీల్‌సాబ్’ సీక్వెల్ చేయాలి అంటే.. పవన్ కళ్యాణ్ మరోసారి అవకావం ఇవ్వాలి. నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మించడానికి ముందుకు రావాలి.
దానికి తగ్గట్టుగా కథ సిద్ధం కావాలి. అప్పుడే ‘వకీల్ సాబ్ 2’ పట్టాలెక్కుతుంది అని అన్నారు వేణు శ్రీరామ్. అయితే ప్రస్తుతం పవన్ లైనప్‌లో ఉన్న సినిమాలు చూస్తే ఇంత త్వరగా ఈ ఆలోచన పట్టాలెక్కేలా కనిపించడం లేదు. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లినా దిల్ రాజు మళ్లీ ఇంత త్వరగా డేట్స్ దొరకవు. ఎందుకంటే పవన్ దగ్గర ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’, ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేక్, మైత్రీ మూవీ మేకర్స్ – హరీశ్ శంకర్, రామ్ తాళ్లూరి – సురేందర్ రెడ్డి, భగవాన్ -పుల్లారావు సినిమా ఇలా చాలా ఉన్నాయి మరి.