చాలా రోజుల క్రితం ఓ మాజీ స్టార్ హీరోయిన్ మాట్లాడుతూ… ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో అన్నారు. ఆ తర్వాత మరో హీరోయిన్ మాట్లాడుతూ ‘అప్పట్లో సోషల్ మీడియా లేకపోతేనేం ఉన్న మీడియాతో వేగలేకపోయాం అన్నారు. పై రెండూ స్టేట్మెంట్స్ కరెక్టే. అయితే తొలి స్టేట్‌మెంట్ కాస్త ఎక్కువ కరెక్ట్ అని చెప్పాలి. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా ఇదే మాట చెప్పారు.
కెరీర్‌లో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి ప్రముఖ బాలీవుడ్ కథానాయిక విద్యా బాలన్ ఓ ఇంటర్వ్యూలో తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో జరిగిన ఓ సంఘటన వల్ల తాను ఎంతో బాధపడ్డానని చెప్పిన ఆమె… ఆ అవమాన భారం, భయంతో ఇంట్లో నుండి బయటకు రావాలనిపించలేదని చెప్పారు. నాకు నేనే నచ్చేదాన్ని కాదు. అందువల్ల, ఎలా కనిపించాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలనే విషయాన్ని పట్టించుకోలేదు అని విద్య చెప్పారు.
అలాంటి తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చక్కటి ఆదరణ పొదానని, నటించిన రెండు కమర్షియల్ సినిమాలు విడుదలయ్యాక తనను ఎంతగానో ఇష్టపడిన వారే విమర్శించడం మొదలుపెట్టారని బాధపడుతూ చెప్పింది విద్యా బాలన్. ఆ పాత్రలకు సరిగ్గా నప్పలేదని, ఓవర్ వెయిట్ ఉన్నావని కామెంట్స్ చేశారట. డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాలేదని అన్నారట. ఓ ఫంక్షన్‌లో వరెస్ట్ డ్రెస్సింగ్ అవార్డుకు తనను ఎంపిక చేశారట.
దీంతో విద్యా బాలన్ (Vidya Balan) చాలా బాధపడిందట. చుట్టుపక్కల వాళ్లు ఎలా చూస్తారనే భయం, బాధతో ఇంట్లో నుండి బయటకు కూడా రావాలనిపించలేదు. అయితే ఆ రోజుల్లో అదృష్టవశాత్తు సోషల్ మీడియా లేదు. ఉంటే నాకు ఇంకా ఇబ్బంది అయ్యేది అని చెప్పుకొచ్చింది విద్యా బాలన్. ‘గురు’, ‘ఏక్‌లవ్య’, ‘పా’, ‘ఇష్కియా’, ‘డర్టీ పిక్చర్’ చిత్రాలతో విద్యా బాలన్ విజయవంతమైన నాయికగా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు సినిమాల జోరు తగ్గించింది.