ఎలాంటి పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోయే నటనా సామర్థ్యం ఆమెది. మంచి కథలను ఎంచుకోవటమే కాదు.. తన తోటి నటులు మంచి సినిమాలు చేస్తే మెచ్చుకుంటుంది. ఎప్పుడూ చీరకట్టులో ఫోజులిస్తుంటుంది. కెమెరా ముందు నవ్వుతూ, హాస్యంగా మాట్లాడే వ్యక్తి విద్యాబాలన్.. నేను షారుక్ , కాజోల్ అభిమానిని. ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాను చాలా సార్లు చూశా. నా సినిమాలు కూడా అలా చూడలేదు. కాజోల్ లోని ఇన్నోసెన్స్‌ను ఇష్టపడేదాన్ని. అప్పట్లో షారుక్ మానియా నడిచేది. అన్ని సినిమాలు చూసేదాన్ని.
మళ్లీ ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలను అలా తొలి షో చూడటం మంచి అనుభూతి కలిగింది. ఈ ఫేజ్ ఎంతో బావుంది. నాకెలాంటి సినిమా నేపథ్యం లేదు. కేరళలోని ఓ మధ్య తరగతి కుటుంబం. ఒక సీరియల్‌తో పాటు కొన్ని మ్యూజిక్ వీడియోలు చేశా. అందువల్లే మోహన్‌లాల్, కమల్‌హాసన్ నటించే సినిమాలో అవకాశం వచ్చింది. పదిహేను రోజులు షూటింగ్ చేశా. ఆ తర్వాత కొన్నెళ్లు సమయం పడుతుందని దర్శకుడు చెప్పారు. నటన సరిగారాదని తీసేశారు.
ఆ తర్వాత కె.బాలచందర్ గారు ఓ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అంతా ఓకే అయ్యాక.. ‘అవకాశం లేదు’ అన్నారు. ఎంతో కోప్పడ్డా. బాధపడ్డా. ఎక్కడా నమ్మకం లేదు. ఆ స్థితిని మర్చిపోలేను. వెంటనే నా మీద నమ్మకంతో దర్శకుడు ప్రదీప్ సర్కార్ ‘పరిణీత’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అది కూడా అలానే అవుతుందేమోనని భయపడ్డా. ఆ తర్వాత సినిమా విడుదలై.. మంచి పేరొచ్చింది. ఇప్పుడు తల్చుకుంటుంటే ఇరవై ఆరేళ్ల వయసులో ఏ సపోర్టు లేకున్నా ముంబైకి వచ్చా. నా కాన్ఫిడెన్స్ భలే ఉండేది అనిపిస్తుందిప్పుడు.
లగే రహో మున్నాభయ్’, ‘హే బేబీ’, ‘భూల్ భూలయా’, ‘పా’, ‘ఇష్కియా’ లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించా. అయితే ‘డర్టీ పిక్చర్’ తర్వాత నన్నందరూ ‘హాట్’ అన్నారు. ఏమేమో.. అన్నారు. ఏమీ పట్టించుకోలేదు. సిల్క్ క్యారెక్టర్ చేశా తప్పేంటీ? అనిపించింది. లోపల ఏదో బాధపడేదాన్ని. ఆ సమయంలో సిద్దార్థ్ నాతో ఇలా అన్నారు.. ‘ఇలాంటి పాత్రలు చేయటం కష్టం. ఏదైనా యాక్సెప్ట్ చేయాలి.. మనం చేసిన తర్వాత’ అన్నారు.
నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి ఇలా మాట్లాడినప్పుడు గ్రేట్ ఫీలయ్యా. టీవీలో రూమర్స్ వినను. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చదవను. ఒక్క నెగటివ్ కామెంట్ చదివినా నెగటివ్ ఆలోచనలు వస్తాయి. అందుకే చదవను. మిమ్మల్ని పది లక్షలు మంది ఫాలోవర్లు ఫాలో అవుతున్నా.. లేదా యాభై మంది ఫాలో అవుతున్నా ఒకటే ప్రెజర్. ఎందుకంటే ప్రతి ఫాలోవరు జడ్జినే ఈ రోజుల్లో. అందుకే కామెంట్స్ డిజేబుల్ చేసుకోవాలంటాన్నేను. ఇన్‌స్టాలో ఫొటోలు, ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో మా టీమ్ షేర్ చేస్తుంది. నేను ఇన్‌స్టాలో కేవలం హాస్యకరమైన రీల్స్ చూస్తానంతే. అని (Vidya Balan) విద్యా బాలన్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.