టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన దగ్గరకు వచ్చే దర్శకనిర్మాతలకు కొత్త షరతులు పెడుతున్నాడట. పాన్ ఇండియా కథైతేనే ఈ రౌడీ హీరో వింటున్నాడట. లేదంటే లేదు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘లైగర్’ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా కథ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక మీద నుంచి కూడా పాన్ ఇండియా స్థాయి సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నాడట. అందుకే కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితమైన కథలను పట్టించుకోవడం లేదని సమాచారం.
ఇదివరకు శివ నిర్వాణతో ఓ సినిమా చేయడానికి విజయ్ ఓకే చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సైతం సందిగ్ధంలో పడింది. దానికి కారణం.. శివ నిర్వాణ చెప్పిన కథ పాన్ ఇండియా స్టోరీ కాకపోవడమే. గతంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ‘టక్ జగదీష్’ కూడా అలాంటి కథే. ఇప్పుడు అదే జోనర్ లో అందమైన ప్రేమకథను సిద్ధం చేసి విజయ్ కి వినిపించాడట శివ నిర్వాణ.
ఈ కథను పాన్ ఇండియా రేంజ్ లో తీర్చిదిద్దలేమని గ్రహించిన విజయ్.. ఇప్పుడు ఆ కథను పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయి కథ చెబితే ఒకే.. లేదంటే శివ నిర్వాణ మరో హీరోని వెతుక్కోవాల్సిన పరిస్థితి. విజయ్ కి తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా క్రేజ్ ఉంది. ‘లైగర్’ విడుదలైతే కానీ అతడు మిగిలిన భాషల్లో జోరు చూపించగలడో లేదో తెలియదు. అలాంటిది ఇప్పటినుండే పాన్ ఇండియా కథల కోసం చూస్తున్నాడంటే విజయ్ కాన్ఫిడెన్స్ మాములుగా లేదు!