ఇండియన్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ఓ ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉంది. భారతీయ క్రికెటర్లలో ఇలా యాటిట్యూడ్ ఉన్న క్రికెటర్లు చాలా తక్కువమంది ఉంటారు. ఆట, యాటిట్యూడ్‌తోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక టాలీవుడ్‌లో అలానే యాటిట్యూడ్‌నే బ్రాండ్‌గా మార్చుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. సినిమాల ఫలితాలను పక్కపెట్టి అతని యాటిట్యూడ్‌ని ఎక్కువమంది ఆరాదిస్తుంటారు. అలాంటి ఇద్దరూ కలిస్తే.. అదిరిపోయింది కదా ఆలోచన. ఈ ఆలోచనను ఇచ్చింది ఎవరో కాదు విజయ్ దేవరకొండనే.
అవును, ఇటీవల ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మాజీ క్రికెటర్, ‘కోబ్రా’తో నటుడిగా మారిన ఇర్ఫాన్ పఠాన్‌తో విజయ్ మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే విజయ్ దేవరకొండకు విరాట్ అంటే చాలా ఇష్టం కాబట్టి. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ బయోపిక్‌ను ఎవరైనా తీద్దాం అనుకుంటే ఆ పాత్రలో నటించడానికి తాను సిద్ధం అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు.
దీంతో ఈ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో విరాట్ జీవితం మీద సినిమా త్వరగా తీస్తే బాగుండు.. ‘రౌడీ’ హీరోను కోహ్లీగా చూడొచ్చు అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఎవరైనా నిర్మాతలు, దర్శకులు ఈ రకంగా ఆలోచిస్తారేమో చూడాలి. ఇప్పటికే ఓసారి విజయ్.. క్రికెటర్‌గా వెండితెరపై కనిపించే ఛాన్స్‌ను వదులుకున్నాడట. 1983 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం రణ్‌వీర్ సింగ్ ‘83’లో విజయ్‌కి ఛాన్స్ ఇచ్చారట.
అందులో సీనియర్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం తొలుత విజయ్‌నే సంప్రదించారట. అయితే డేట్స్ విషయంలో సమస్య వచ్చి కాదనుకున్నాడు విజయ్. దీంతో ఆ పాత్రలో జీవా నటించాడు. మరి విరాట్‌గా విజయ్‌ని చూపించడానికి ఎవరైనా ముందుకొస్తారేమో చూడాలి. ప్రస్తుతం క్రికెట్‌లో విరాట్ పరిస్థితి ఏమంత బాగాలేదు. సెంచరీ కొట్టి సుమారు మూడేళ్లు అవుతోంది. మరోవైపు విజయ్ దేవరకొండ సరైన హిట్ కొట్టి నాలుగేళ్లు అవుతోంది.