స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడమే కాదు.. ఆ పేరుని నిలబెట్టుకోవాలి. అందుకోసమే విజయ్ దేవరకొండ శ్రమిస్తున్నారు. వరుసగా మూడు హిట్స్ అందుకోవడంతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. అతను తాజాగా నటించిన చిత్రం నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. తొలిసారి విజయ్ పొలిటికల్ నేపథ్యంలో సినిమా చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే వారం వ్యవధిలోనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకున్న అరవింద సమేత మూవీ రిలీజ్ అవుతోంది. ఆ భారీ సినిమా వస్తున్నట్టు తెలిసికూడా నోటా రిలీజ్ చేస్తున్నారంటే.. విజయ్ కి ఎంత దైర్యం అనే వారు లేకపోలేదు. ఇదే ప్రశ్నను అతని ముందు ఉంచితే ఇలా స్పందించారు.
“ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సినిమా రాబోతుండగా.. ముందు వారం నోటాను రిలీజ్ చేయడం వల్ల రిస్క్ నాకే. నష్టం జరిగేది నా సినిమాకే. ఈ విషయంలో భయపడి వెనక్కి తగ్గాల్సింది మేమె. అయితే మీ సినిమా రిలీజ్ చేయొద్దు అని ఎవరైనా నన్ను ఆదేశిస్తే మాత్రం నేను వినను. అలా అనే హక్కు ఎవరికీ లేదు” అని విజయ్ స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా “ఎన్టీఆర్ సినిమాకు, నా సినిమాకు తేడా చాలా ఉంది. నా సినిమా బడ్జెట్.. బిజినెస్ తో పోలిస్తే ఎన్టీఆర్ సినిమా పది రెట్ల స్థాయిలో ఉంటుంది. అలాంటపుడు నేను ఎన్టీఆర్ కు పోటీ ఏంటి?” విజయ్ ప్రశ్నించాడు. “నా సినిమాను దసరా సెలవుల్లో రిలీజ్ చేయాలనేది నా కోరిక. ఎన్టీఆర్ సినిమాకు భారీగా థియేటర్లు వెళ్లిపోతాయి కాబట్టే దసరా సెలవుల్లో రిలీజ్ చేయలేక ముందుకు వచ్చాము. ఇంకా కొన్ని కారణాలున్నాయి” అని వివరించారు.