సినిమా బాగుంటే నా గొప్పతనం… అదే తేడా కొడితే ఎవరో ఒకరి మీదే నెట్టేద్దాం! ఏంటీ కొత్త నినాదం అనుకుంటున్నారా? ఇది కొత్తేం కాదు.. గతంలో కొంతమంది హీరోలు ఈ పనిని విజయవంతంగా చేసి గొప్పోళ్లు అయిపోయారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చర్చకు వస్తోంది అనేగా మీ డౌట్. రీసెంట్‌గా టాలీవుడ్‌లో వచ్చిన ఓ సినిమాకు సరైన ఫలితం దక్కలేదు. అందులో తప్పేమీ లేదు. అన్ని సినిమలూ విజయాలు అందుకోవాలని లేదు.
అయితే ఇలా ఒక్క షో అయిందో లేదో వెంటనే సినిమా ఫలితానికి ఒక సాంకేతిక నిపుణుణ్ని బాధ్యుణ్ని చేసేస్తూ ట్వీట్లు, చర్చ మొదలైపోయింది. ఇటీవల రిలీజ్ అయిన సినిమా అంటే అది ‘ఫ్యామిలీ స్టార్’ అని మీకు అర్థమయ్యే ఉంటుంది. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవారు అయితే ఆ సాంకేతిక నిపుణుడు ప్రముఖ సంగీత దర్శకుడు గోపీసుందర్ అని చెప్పేస్తారు. ‘ఫ్యామిలీ స్టార్’ (The Family Star) సినిమాకు గోపీ సుందర్ (Gopi Sundar) మ్యూజిక్ ఏ మాత్రం ఉపయోగపడలేదని…
పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ పేలవంగా ఉన్నాయి అంటూ రిలీజ్ రోజు సాయంత్రానికి వార్తలు వచ్చేలా ట్వీట్లతో కొంతమంది దండయాత్ర చేశారు. దీంతో ఆ నష్టం ఆయన ఖాతాలో వేసే ప్రయత్నం జరుగుతోంది. గోపీసుందర్ తెలుగులో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న సంగీత దర్శకుడు. మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన ఆయన తెలుగులో ‘నిన్ను కోరి’ (Ninnu Kori) , ‘మజిలీ’ (Majili) , ‘గీత గోవిందం’ (Geetha Govindam) లాంటి బ్లాక్‌బస్టర్లకు సంగీతం అందించి మెప్పించారు. అయితే ఇటీవల ఆయన పాటల్లో ఆ మ్యాజిక్ కనిపించలేదు.
అలా అని మొత్తంగా చప్పగా ఉన్నాయి అని అనలేం కూడా. ఆయన అందించి ఫీల్ గుడ్ మ్యూజిక్‌కి ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ వైఫల్యం మొత్తం ఆయనది కాదు అని కొంతమంది నెటిజన్ల వాదన. సినిమా రిలీజ్‌కు ముందు బాగున్నాయని అభిమానులు మెచ్చుకున్న పాటలు… సినిమా రిలీజ్ అయి సరైన టాక్ అందుకోకపోగానే ఎందుకు బాగోలేవు అని అంటున్నారో తెలియాలి అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.