తెలుగు సినిమాలో ‘ఒక్కడు’కి మరపురాని చరిత్ర ఉంది. మహేష్‌బాబు (Mahesh Babu) కెరీర్ సాదాగా సాగుతున్న సమయంలో ఓ మాస్ హిట్ అవసరం అనుకుంటున్నప్పుడు వచ్చిన సినిమా ‘ఒక్కడు’ (Okkadu) . దానిని సినిమా అనే కంటే ఉప్పెన అనడం బెటర్. మహేష్‌లోని వైవిధ్యమైన నటుణ్ని, ఎలా చూపిస్తే మహేష్ ఫ్యాన్స్ ఆనందిస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకుని దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) ఆ సినిమా చేశారు. ఈ సినిమా ఆ తర్వాత ‘గిల్లి’గా (Ghilli) తమిళంలోకి వెళ్లింది.
విజయ్ (Vijay Thalapathy) హీరోగా నటించిన ‘గిల్లి’ అని ఇప్పుడు అంటున్నాం కానీ.. ఆ సినిమా దర్శకుడు ధరణి (Dharani) తొలుత వేసిన ప్లాన్స్ వర్కవుట్ అయి ఉంటే విక్రమ్ నటించిన ‘గిల్లి’ అని రాసేవాళ్లం. అవును ‘గిల్లి’ సినిమాకు హీరోగా తొలుత అనుకున్నది విక్రమ్‌ని (Vikram) అట. ఈ విషయాన్ని దర్శకుడు ధరణి ఇటీవల వెల్లడించారు. ఇప్పుడు రీరిలీజ్‌లో కూడా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న ‘గిల్లి’ హీరో విక్రమ్ అవ్వాల్సిందట.
సినిమా హీరోగా విక్రమ్‌ని తీసుకోవాలని దర్శకుడు ధరణి ఆలోచన చేశారట. డేట్స్, షెడ్యూల్స్ తదితర సమస్యల కారణంగా విక్రమ్ ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదుట. దీంతో ఆ పాత్ర విజయ్ వద్దకు చేరిందట. అలా 20 ఏళ్ల క్రితం ఓ పెద్ద సినిమా విక్రమ్ నుండి విజయ్ దగ్గరకు వచ్చిందట. ఒకవేళ ఇదే సినిమా విక్రమ్ చేసి ఉంటే ఎలా ఉండేది అని అభిమానులు లెక్కలేస్తున్నారు.
ఇక ఈ సినిమా ఆ రోజుల్లో రూ. 8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో అప్పట్లో రూ. 43 కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు రీరిలీజ్‌లో రెండు రోజులకే రూ. 12 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ జోరు చూస్తుంటే మరికొన్ని రోజులు సినిమా వేస్తే ఫస్ట్ రిలీజ్ వసూళ్ల దగ్గరకు రీరిలీజ్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. విజయ్ ఇంకా ఎక్కువ సినిమాలు చేయడు అని తెలియడమూ ఈ వసూళ్లకు కారణం అని అంటున్నారు.