టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు. ఒక్క పాన్ ఇండియా సినిమా సక్సెస్ సాధిస్తే ఇతర భాషల్లో మార్కెట్ పెరగడంతో పాటు రెమ్యునరేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దర్శకనిర్మాతలు సైతం పాన్ ఇండియా సినిమాలను నిర్మించడానికి, తెరకెక్కించడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. రవితేజ సినీ కెరీర్ లో విక్రమార్కుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఈ సీక్వెల్ కు ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రవితేజతో 100 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే వర్కౌట్ అవుతుందా? అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ కు స్టార్ రైటర్ గా క్రేజ్ ఉండటంతో ఒక నిర్మాత ఈ సినిమాను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఆ నిర్మాత సినిమాను హ్యాండిల్ చేయగలరా? లేదా? అనే సందేహాలు నెలకొనడంతో విజయేంద్ర ప్రసాద్ ఆలోచనలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు విక్రమార్కుడు సీక్వెల్ పై రవితేజ ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం అందుతోంది. క్రాక్ సక్సెస్ తర్వాత రవితేజ ఖిలాడీ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. రవితేజ కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.