మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న `వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రానికి దగ్గర పోలికలున్నట్టు.. ‘వినయ విధేయ రామా’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక అసలు విషయానికి వస్తే… ‘వినయ విధేయ రామా’ చిత్రానికి `గ్యాంగ్ లీడర్` చిత్రానికి దగ్గర పోలికలున్నట్టు అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ‘గ్యాంగ్ లీడర్’చిత్రం అన్నాదమ్ముల కథ. అన్నయ్య మరణాన్ని తమ్ముడి దగ్గర దాచి పెడతారు. ఆ సంగతి తెలిశాక.. తమ్ముడు శత్రుసంహారం కోసం రంగంలోకి దిగుతాడు. ఇంచు మించు ‘వినయ విధేయ రామా’ చిత్ర కథ కూడా అలానే ఉండబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కూడా అన్నదమ్ముల కథే. రాంచరణ్ పెద్దన్నయ్య అయిన ప్రశాంత్ ని ప్రత్యర్థులు చంపేస్తే.. ఆ విషయాన్ని.. తమ్ముడు చరణ్ దగ్గర దాచి పెడతారు చిన్నన్నయ్యలు. ఇక అసలు నిజం తెలుసుకున్న తరువాత చరణ్ ఏంచేసాడన్నది మిగిలిన కథంట.
ఇక ‘వినయ విధేయ రామా’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా.. ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. చరణ్ మాట్లాడుతూ.. “అసలు ఈ రెండు సినిమాలకూ పోలిక లేదు. నాకు గ్యాంగ్ లీడర్ అంటే చాలా ఇష్టం. అలాంటి కథని చేద్దామనుకున్నాను కానీ… ‘వినయ విధేయ రామా’ అలాంటి కథ కాదు. ఈ చిత్రంలోని సన్నివేశాలు, టేకింగ్… అంతా కొత్తగా ఉంటుంది. తెర పై చూశాక ఆ విషయం మీకే అర్థం అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు చరణ్. ఇక బోయపాటి గత చిత్రాల్లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉంటాయి కదా.. మరి ఈ చిత్రం కూడా అలాగే ఉండబోతుందా ? అని అడిగిన ప్రశ్నకు… “బోయపాటి మార్కు సన్నివేశాలు ఉంటాయి. అయితే… హింస ఎక్కువగా ఏం ఉండదు. ఫ్యామిలీ తో కలిసి చూసేలానే సినిమా ఉంటుంది. అందుకే ఒక్క కట్ కూడా లేకుండా ‘యు బై ఏ’ సర్టిఫికెట్ వచ్చింది” అంటూ క్లారిటీ ఇచ్చాడు చరణ్..!