తెలుగు వాడైనా… తమిళ సినిమా పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ, విజయాలు సాధిస్తూ స్టార్ హీరో అయిపోయాడు విశాల్ (Vishal) . తెలుగులోనూ ఆయన సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అలా ‘తుప్పరివాలన్’గా తమిళంలో తెరకెక్కి తెలుగులో ‘డిటెక్టివ్’గా వచ్చిన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమైంది. ఈ సారి ఈ సినిమా కోసం విశాల్ కేవలం హీరోగా మాత్రమే కాదు, దర్శకుడిగానూ భాగమవుతున్నాడు.
అవును, చాలా ఏళ్లుగా దర్శకత్వంలోకి వస్తాను అని చెబుతూ వచ్చిన విశాల్ ఇప్పుడు డైరక్టర్ అయిపోతున్నాడు. ఈ మేరకు ఎక్స్ (మాజీ ట్విటర్) వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. 25ఏళ్ల తర్వాత ఎట్టకేలకు నా ప్రయాణం మొదలైంది. నా కల, నా ఆకాంక్ష, నా మొదటి ఆలోచన ఎట్టకేలకు నా జీవితంలో నిజం అవుతోంది. అవును ఇప్పుడు నేను కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నాను. దర్శకుడిగా పరిచయమవడం అన్నది ఇది నా కెరీర్‌లో అత్యంత సవాలుతో నిండినది అని చెప్పాడు విశాల్.
‘తుప్పరివాలన్ 2’ / ‘డిటెక్టివ్ 2’ సినిమా కోసం లండన్ బయలుదేరాం. అజర్ బైజాన్, మాల్లా తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేయబోతున్నాం. ఈ మూమెంట్‌ను వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. ‘ఇన్నాళ్లూ పడిన కష్టం ఎప్పుడూ వృథా కావడం లేదు’ అంటూ తండ్రి జీకే రెడ్డి, యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) గతంలో తనతో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అని అన్నాడు విశాల్. ఏది ఏమైనా, ఫలితం ఎలా వచ్చినా కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించడం మానను అని చెప్పాడు.
నటుడిగా నాకు గుర్తింపునిచ్చిన అందరికీ ధన్యవాదాలు. దర్శకుడిగా కూడా నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. నా కల ఇంత త్వరగా సాకారం కావడానికి కారణమైన మిస్కిన్‌కు (Mysskin) కృతజ్ఞతలు. ‘డిటెక్టివ్ 2’ సినిమా కూడా మిస్కిన్ దర్శకత్వంలోనే రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీంతో విశాలే మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు.