విశ్వక్‌సేన్ సినిమా అంటే వివాదం.. ఈ మాట మేం అనడం లేదు. ఇటీవల కాలంలో విశ్వక్‌సేన్ నుండి వచ్చిన సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సమయంలో జరిగిన రచ్చ చూసి ఎవరైనా ఇదే మాట అంటారు. అసలు ఆ సినిమా జనాల్లోకి అంతగా వెళ్లడానికి కూడా ఆ వివాదమే కారణం అని చెబుతుంటారు. మరి ఇప్పుడు ‘ఓరి దేవుడా’ సినిమా ఎలాంటి వివాదం లేకుండా వచ్చేసింది. దీనిపై విశ్వక్‌సేన్‌ను అడిగితే ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చాడు. దీంతోపాటు కెరీర్ గురించి కూడా మాట్లాడడు.
వివాదాల వల్ల వచ్చిన మేలంటూ ఏమీ లేదు అన్న విశ్వక్‌సేన్.. ఒకవేళ వివాదం చోటు చేసుకున్నాక దాని గురించి భయపడి ఇంట్లో కూర్చున్నానంటే నన్నే సర్దేస్తారు అని తన శైలి చెప్పుకొచ్చాడు. వివాదం వచ్చినప్పుడు బలంగా ఎదుర్కొని, పోరాడి నా తప్పేమీ లేదని నిరూపించుకుంటాను. అంతేతప్ప ఊరుకోను అని చెప్పారు. ‘హిట్’ సినిమా కూడా ఎలాంటి వివాదం లేకుండా విడుదలై విజయవంతమైంది. ఇప్పుడు ‘ఓరి దేవుడా’ విషయంలోనూ అంతే అవుతుంది అని నమ్మకంగా చెప్పాడు.
కెరీర్ గురించి విశ్వక్‌సేన్ మాట్లాడుతూ… ఇప్పటివరకు కెరీర్ పరంగా ఏదీ ప్లాన్ చేయలేదు. అన్నీ అలా అనుకోకుండానే జరిగిపోతున్నాయి అంతే. అయతే ఏదీ ఎక్కువ, తక్కువ కాకుండా పనిచేస్తూ వెళ్తున్నాను అని చెప్పాడు విశ్వక్‌సేన్. ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా చేస్తున్నప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాడట విశ్వక్. 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ప్రయోగాలు చేయాలి, ఆ తర్వాత బాక్సాఫీసు, స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించాలి అని అనుకున్నాను అని చెప్పాడు.
ఇక ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలపై సంతృప్తిగానే ఉన్నాను. ఒక సినిమాకు, మరో సినిమాకు సంబంధం లేకుండా చేస్తూ వచ్చాను. ఇంకొన్నాళ్లు ఇలానే కొనసాగుతుంది అని చెప్పాడు. డైరెక్టోరియల్ డెబ్యూ సినిమా ‘దాస్ కా ధమ్కీ’ చిత్రీకరణ పూర్తయిందట. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారు. ఆ తర్వాత ‘గామి’ సినిమా విడుదలవుతుంది. ‘ఫలక్‌నామాదాస్ 2’ కూడా చేసే ఆలోచన ఉందట. అన్నీ ఓకే అయితే నెక్స్ట్ ఇయర్ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట.