“వివేకం” సినిమాతో ఆడియన్స్ ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన అజిత్-శివల కాంబినేషన్ ఈసారి “విశ్వాసం”తో వచ్చారు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ కి మాస్ ఎలివేషన్స్ కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించగా.. అదే పేరుతో తెలుగులోకి అనువదించి నేడు విడుదల చేశారు. మరి తమిళ సూపర్ హిట్ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ:గోదావరి జిల్లాకు చెందిన రావులపాలెం గ్రామ పెద్ద వీర్రాజు (అజిత్). ఊర్లో గౌరవం, పిలిస్తే పలికే ఊరి జనం ఇలా అన్నీ ఉన్నా.. తన భార్య, కుమార్ట తన దగ్గర లేరు అని బాధపడుతుంటాడు. ఊర్లో చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న జాతరకు కూతురు శ్వేత (అనిఖ సురేంద్రన్), భార్య నిరంజన (నయనతార)ను పిలుద్దామని ముంబై వస్తాడు. ముంబైలో అడుగుపెట్టిన మరుక్షణమే.. తన కూతురు శ్వేతకు ప్రాణహాని ఉందని తెలుసుకొంటాడు వీర్రాజు. అప్పట్నుంచి ఆమెకు తోడుగా, అండగా భార్యకు నీడగా ముంబైలో ఉంటాడు.అసలు శ్వేతను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అందుకు కారణం ఏంటి? వీర్రాజు తన కుమార్తెను కాపాడుకోగలిగాడా? అనేది “విశ్వాసం” కథ.
నటీనటుల పనితీరు:ఇప్పటికే చాలాసార్లు తాను సంపూర్ణ నటుడ్ని అని ప్రూవ్ చేసుకున్న అజిత్ మరోసారి వీర్రాజు పాత్రలో తాను సెంటిమెంట్ సీన్స్ పండించడంలో స్పెషలిట్ అని నిరూపించాడు. కూతురు శ్రేయస్సు కోసం తాపత్రయపడే తండ్రిగా అజిత్ పండించే ఎమోషన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్.ఆల్రెడీ “ఎంతవాడు గానీ” చిత్రంలో అజిత్ కుమార్తెగా అలరించిన బేబీ అనిఖ ఈ చిత్రంలో మరోసారి కూతురు పాత్రలో ఆకట్టుకుంది. పాప నటన సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి.ఇండిపెండెంట్ ఉమెన్ గా నయనతార మంచి పాత్ర పోషించింది. కాకపోతే.. ఆమె పాత్ర “తులసి” సినిమాని గుర్తుకుతెస్తుంది. తంబిరామయ్య, రోబో శంకర్, వివేక్ ల కామెడీ బాగుంది. జగపతిబాబు స్టైలిష్ విలన్ గా మరోసారి ఆకట్టుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు:వెట్రి సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఫైట్ సీక్వెన్స్ లను అతడు చిత్రీకరించిన విధానం ఆడియన్స్ చేత ఈలలు వేయిస్తుంది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఫైట్ సీన్స్ ను మాత్రం చాలా ప్లాన్డ్ గా షూట్ చేశాడు వెట్రి.డి.ఇమ్మాన్ పాటలు సోసోగా ఉన్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా.. ఎమోషనల్ సీన్స్ కి ఇమ్మాన్ అందించిన నేపధ్య సంగీతం ఫ్యామిలీ ఆడియన్స్ ను కదిలిస్తుంది.
ఇక ఫైట్స్ సీన్స్ కి కూడా తన నేపధ్య సంగీతంతో భీభత్సమైన ఎలివేషన్ ఇచ్చాడు ఇమ్మాన్.దర్శకుడు శివ రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయినా.. కథనంతో లాక్కొచ్చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ను చాలా బాగా రాసుకున్నాడు శివ. అలాగే.. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ ను బాగా రాసుకున్నాడు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎమోషనల్ సీన్స్ ను, మాస్ ఆడియన్స్ ఎలివేషన్ సీన్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. సో, వివేకంతో అజిత్ కి భారీ ఫ్లాప్ ఇచ్చిన శివ.. “విశ్వాసం”తో సూపర్ హిట్ ఇచ్చి లెక్క క్లియర్ చేశాడు.
విశ్లేషణ:కథ పాతదే కానీ.. కథనం, అజిత్ నటన, ఎలివేషన్ & ఎమోషనల్ సీన్స్ కోసం “విశ్వాసం” సినిమాని ఒకసారి చూడొచ్చు. కాకపోతే.. ఈ సినిమా తమిళ వెర్షన్ ఆల్రెడీ అమేజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండడంతో కలెక్షన్స్ పై ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూడాలి.