నాగ్ అశ్విన్ అలియాస్ నాగీ.. ఈయన సినిమాలు చాలా స్పెషల్. తొలి సినిమా నుండి ఆయన సినిమాలు సగటు టాలీవుడ్ యువ దర్శకుల సినిమాల్లా ఉండవు. ఆయన సినిమాలు ప్రేక్షకుల వినోదం, భావోద్వేగంతోపాటు ఇంకేదో స్పెషల్ ఎలిమెంట్ అందించేలానే ఉంటాయి. తాజాగా ఆయన ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాకు సంబంధించి ఎక్కడా ఏమీ అధికారిక సమాచారం అయితే రావడం లేదు. అయితే కొన్ని పోస్టర్లు, టీజర్ లుక్‌లు మాత్రం వస్తున్నాయి. వాటిని చూస్తే ఏదో డిఫరెంట్ ఫీల్ వస్తోంది. దీంతో అసలేంటీ సినిమా కాన్సెప్ట్ అనే చర్చ మొదలైంది.
‘ప్రాజెక్ట్ కె’ సినిమా అనుకున్న తొలి రోజుల్లో ఆ సినిమా కోసం పని చేస్తున్న టీమ్, సలహాదారుల టీమ్ బట్టి చూస్తే.. ఇదో సైన్స్‌ఫిక్షన్ సినిమా అని తేలిపోయింది. దాదాపుగా రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పుడు దేశం మొత్తం అంచనాలు పెట్టుకుంటోంది. మరి ఆ స్థాయిలో సినిమా రావడానికి నాగ్ అశ్విన్ ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద కార్లు, టైర్లు, స్పేస్ షిప్, స్పేస్ షూట్లు, కొత్త రకం ఆయుధాలు లాంటివి సినిమాలో వాడుతున్నారని లీక్‌ల ద్వారా తెలిసింది.
2024 సంక్రాంతి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తామని టీమ్ ప్రకటించింది. అంటే జనవరి 12న సినిమాను విడుదల చేస్తామని తెలిపింది. ఆ పోస్టర్‌పై ఎవరిదో ఓ అరచేయి భూమిపైన ఉంది. దిగువన గన్స్ పట్టుకొని ఇద్దరు కనిపిస్తున్నారు. ఇందులో విషయమేమీ అర్థం కావడం లేదు. అంతకుమందు దీపిక పడుకొణె పుట్టిన రోజునాడు బ్యాక్ లుక్‌లో డస్టీగా ఉన్న ఫొటో రిలీజ్ చేశారు. అంతకుముందు ఇతర తారల పుట్టిన రోజు సమయంలో చేతులు మాత్రమే చూపించారు. అవన్నీ చూస్తే ఇదేదో సూపర్ హీరో సినిమాలా అనిపించింది.
దాంతోపాటు పోస్టర్‌లో The World is Waiting అనే క్యాప్షన్ పెట్టారు కూడా. ఓవైపు భారీ చేయి, స్పేస్ సూట్స్ లాంటివి వేసుకున్న మనుషులు చూస్తుంటే అసలు ఈ కథ మన గ్రహం మీద జరిగేదేనా అనే డౌట్ కూడా వస్తోంది. లేదంటే మన గ్రహం మీదకు వేరే గ్రహం నుండి ఎవరైనా వస్తే మన హీరో వాళ్లను ఎదిరించి కాపాడతాడా? లేక వేరే గ్రహం కష్టాల్లో ఉంటే మన హీరో అక్కడికి వెళ్తాడా అనేది తెలియడం లేదు.