బంధాలు – అనుబంధాల నేపథ్యంలో సాగే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో కెరీర్ ప్రారంభించి… జాతి గర్వించే ‘మహానటి’ సినిమా చేశారు నాగ్ అశ్విన్. సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆయన్ని నాగీ అని పిలుస్తుంటారు. ఆ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు ఆయన ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే మరొక్క విషయమే తెలియడం లేదు. అదే ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమా కథేంటి, ఎలా ఉండబోతోంది అనే ప్రశ్న వినిపిస్తూనే ఉంది. దీనికి కారణం వస్తున్న లీక్‌లు, షూట్ చేస్తున్న ప్రదేశాలు డిఫరెంట్‌గా ఉండటమే.
‘ప్రాజెక్ట్ కె’ సినిమా స్టార్ట్ అయిన కొత్తల్లో అందరూ మాట్లాడుకున్న విషయాలు అంటే సినిమాలో నటీనటులే. అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనె లాంటి అగ్ర బాలీవుడ్ నటుల్ని తీసుకొచ్చారు, తీసుకొస్తున్నారు అంటూ లెక్కలేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సీన్స్‌ను చూసిన టాలీవుడ్ జనాలు ఈ సినిమా టైమ్‌ట్రావెల్ నేపథ్యంలో ఉంటుంది అని చెప్పుకొచ్చారు. స్పేస్ షూట్లు ధరించిన కొంతమందిపై నెల్లూరు శివార్లలో షూటింగ్ జరిగింది. దీంతో ఈ కాలంలో భవిష్యత్తుకు వెళ్తున్నారు అని చెప్పారు.
అయితే మొన్నీమధ్య అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజుకు, ప్రభాస్ బర్త్‌డేకి రిలీజ్ చేసిన బర్త్‌డే పోస్టర్లలో సూపర్ హీరోస్ కథ ఇది అని అర్థమయ్యేలా ఫొటోలు, రైటప్‌లు రాసుకొచ్చారు. దీంతో ఇది టైమ్ ట్రావెల్ సినిమానేనా కాదా? అనే ప్రశ్న మొదలైంది. అయితే ఇప్పుడు మరో విషయం బయటికొచ్చింది. నగర శివార్లలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేశారు. దేవాలయాల నేపథ్యంలో రూపొందిన ఆ సెట్‌లో షూటింగ్ జరుగుతోందట. సూపర్ హీరోలు, దేవాలయాల సింక్ ఏంటో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.
సూపర్ హీరోల నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ స్టోరీలో భారతీయ పురాణ ఇతిహాసాలకు కూడా చోటు కల్పిస్తూ నాగీ ఈ సినిమా కథను రాసుకున్నారని అర్థమవుతోంది. ప్రభాస్ ‘సలార్’ సినిమా షూటింగ్ డీటెయిల్స్, లుక్స్ లీక్ అవుతున్నా.. ‘ప్రాజెక్ట్ కె’కు సంబంధించి ఎలాంటి విషయాలను బయటకు రానివ్వకుండా యూనిట్ జాగ్రత్త పడుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 18, 2023న సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. లేదంటే 2024 సంక్రాంతికి సినిమాను తీసుకొస్తామని నాగీ మామ, ప్రముఖ నిర్మాత.. ఈ సినిమాకు డబ్బులు పెడుతున్న అశ్వనీదత్ ఇటీవల చెప్పారు.