హోరా హోరీగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణువర్థన్ బాబు ఎన్నికయ్యారు. త్వరలో ప్రమాణస్వీకారం కూడా జరగబోతోంది. అది చాలా చిన్న ప్రక్రియ అనుకోండి. ఆ తర్వాత అసలు మజా మొదలవుతుంది అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ‘మేనిఫెస్టో’ అంటూ… ఓ జాబితా ఇచ్చి మరీ విష్ణు ఈ ఎన్నికల్లో ‘మా’ సభ్యుల ముందుకొచ్చాడు. వాటిని ఎలా నెరవేరుస్తాడు, దాని వెనుక ఉన్న పరిస్థితులు ఏంటో చూద్దాం.
విష్ణు ప్యానల్ మేనిఫెస్టోలో కీలక అంశాల గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని అంశాలున్నాయని మరచిపోవద్దు. అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ‘మా’ సభ్యులకు ‘మా యాప్’ ద్వారా సభ్యుల పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసి, నిర్మాతలు, దర్శకులు, రచయితలకు అందిస్తామని విష్ణు చెప్పాడు. ‘జాబ్ కమిటీ’ ద్వారా వారందరికీ సినిమాలు, ఓటీటీల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామన్నాడు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇలా చేయడం వరకు ఓకే. వారికి అవకాశాలు వచ్చేలా చేయడం, దానికి తగ్గట్టుగా ఫాలోఅప్ చేయడం ముఖ్యం.
తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టిపడేలా సొంత డబ్బులతో ‘మా’ భవన నిర్మిస్తాం. దీనికి మించిన పెద్ద హామీ ఇంకొకటి లేదు. అయితే ఇది నెరవేరాలంటే చాలామంది ముందుకురావాలి. అయితే ఎవరూ అక్కర్లేదు మా కుటుంబం మాత్రమే చేస్తుంది అన్నాడు విష్ణు. అయితే ఈ పని అంత సులభం కాదని పరిశీలకులు చెబుతున్నారు. మరి విష్ణు ఎలా ఈ పాయింట్‌ను నెట్టుకొస్తాడనేది చూడాలి. అర్హులైన ‘మా’ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహం. గత ప్యానల్ ఈ పని మొదలుపెట్టి ఆపేసింది. విష్ణు ముందుకు తీసుకెళ్తే మంచిదే.
‘మా’లో ఉన్న ప్రతి సభ్యుడికీ, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా. ‘మా’ సభ్యుడికి ఉచితంగా ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డులు. ప్రభుత్వం ఇచ్చే సేవల్ని ‘మా’ సభ్యులకు అందించడం, అందుకు తగ్గట్టుగా చర్చలు తీసుకోవడంతో ఈ పని చేయొచ్చు. దీనికి కో ఆర్డినషన్ చాలా ముఖ్యం. గత ప్యానల్‌లో ఇది కుదర్లేదనే వాదనలు వినిపించాయి. విష్ణు ఏం చేస్తాడో చూడాలి.
అర్హులైన ‘మా’ సభ్యుల పిల్లలకు కేజీ టు పీజీ వరకూ విద్యా సాయం. ఈ పని చేస్తే పేద కళాకారులకు చాలా ఉపయోగం. ఈ హామీని విష్ణు నిలబెట్టుకుంటే పేద కళాకారులు రుణపడి ఉంటారు. అయితే విద్య ఇప్పుడు వ్యాపారంగా మారింది. మరి ఎలా విష్ణు చేస్తాడో చూడాలి. ‘మా’ మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణకోసం హైపవర్ కమిటీ ఏర్పాటు. గత ప్యానల్‌లోనూ ఇది వినిపించింది. అయితే ఈసారి చేస్తాం అంటున్నారు. పార్లమెంటులో మహిళా బిల్లులాగే ఇదీ ఆలస్యమవుతుందా? చూడాలి.
అర్హులైన వృద్ధ కళాకారులకు ప్రతి నెలా పెన్షన్ అందేలా ఏర్పాటు. అలాగే రూ.6000 పెన్షన్ గణనీయంగా పెంచే ఏర్పాటు. దీనికి డబ్బు బాగా ఖర్చవుతుంది. ప్రస్తుతం ‘మా’ దగ్గర అంత డబ్బు లేదు. దీని కోసం ఈవెంట్లు చేసి సంపాదించాలి. మరి విష్ణు ఆ దిశగా పనులు చేస్తే… స్టార్లు ముందుకురావాలి. ఎవరొస్తారో చూడాలి. గౌరవ సభ్యుత్వం ఇచ్చిన సీనియర్ సిటిజన్స్‌కు ఓటు హక్కు వచ్చేలా ఏజీఎంలో ఆమోదం. ఇది పెద్ద కష్టమైన పనేం కాదు.
‘మా’ సభ్యుల పిల్లలకు సినిమాల పట్ల అభిరుచి ఉంటే వారికి ‘మోహన్‌బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’ ద్వారా 50శాతం స్కాలర్‌షిప్‌తో శిక్షణ ఇప్పించడం. ఇలాంటి పనులు చేస్తే యువ కళాకారులకు ఉపయోగం ఉంటుంది. మరి విష్ణు ఎంతమేరకు ఈ పని చేస్తాడు, సక్సెస్ అవుతాడో చూడాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చలన చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రస్తుతం పరిశ్రమకు చాలా అవసరం. రెండు రాష్ట్రాల సీఎంలతో మోహన్‌బాబుకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పని చేయకపోతే పరువు పోతుంది. కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకునైనా విష్ణు ఈ పని చేస్తారని పరిశీలకులు అంటున్నారు.