‘ది రాజాసాబ్’ సినిమా ప్రచారానికి ప్రభాస్ రావడం లేదు.. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా ప్రచారానికి చిరంజీవి రావడం లేదు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రమోషన్స్‌కి రవితేజ అప్పుడప్పుడు వచ్చాడు.. ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా ప్రచారమే సరిగ్గా జరగడం లేదు అని అనుకుంటున్నాం.. అవి నిజాలు కూడా. అయితే మధ్యలో మరో విషయం మరచిపోతున్నాం. ‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రచారానికి దర్శకుడు మారి రావడం లేదు. అంతేకాదు ఆయన పేరు కూడా ప్రచారంలో వినిపించడం లేదు.
Director Mari
కావాలంటే మీరే చూడండి.. ‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రచారంలో ఎక్కడా డైరక్టర్ పేరు వినిపించడం లేదు. ఆయన రాకపోయినా హీరో నోటనో లేక నిర్మాత నోటనో మారి పేరు వినిపించాలి కదా. కానీ ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో ఎక్కడా ఆ ప్రస్తావనే లేదు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న నిర్మాత నాగవంశీ అయితే.. ఈ సినిమా కోసం నవీన్ పొలిశెట్టి బాగా కష్టపడ్డాడు.. ఆయన సీన్లను ఆయనే బాగా డెవలప్ చేసుకున్నాడు అని చెప్పారు తప్ప.. మారి ఏం చేశారు అనేది ఎక్కడా చెప్పలేదు.
నవీన్ పొలిశెట్టి చాలా ఏళ్ల క్రితం మొదలుపెట్టిన సినిమా ‘అనగనగా ఒక రాజు’. నిజానికి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కంటే ముందే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఆ రోజుల్లో ‘మ్యాడ్’ దర్శకుడు కల్యాణ్ శంకర్‌ను ఈ సినిమాకు దర్శకుడిగా అనుకున్నారు. ఆ సమయంలో యాక్సిడెంట్ కారణంగా నవీన్ పొలిశెట్టి సినిమాలకు దూరమయ్యాడు. తిరిగి వచ్చి సినిమా మొదలుపెట్టాక దర్శకుడు మారారు. కల్యాణ్ శంకర్ ప్లేస్‌లో మారి వచ్చారు. ఇప్పుడు ఆయన ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు.
సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నాడు అని అనుకుందాం. త్వరలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఆ రోజు కూడా మారి రాకపోతే సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనుకోవచ్చు. అన్నట్లు ఈ సినిమాకు ఆయన పనితనం నచ్చి ఖరీదైన గిఫ్ట్‌ని ఒకటి నిర్మాత నాగవంశీ ఇచ్చారని ఆ మధ్య వార్తలొచ్చాయి మరి..