‘ప్రభాస్ కారుకి బ్లాక్ ఫిల్మ్ ఉందని పోలీసు ఫైన్ వేశారు!’ అంటూ ఆ మధ్య ఓ వార్త వచ్చింది. ఆ తర్వాత ‘అదేం లేదు. ఆ కారు ప్రభాస్‌ది కాదు’ అంటూ అతని పీఆర్ టీమ్ ఓ వార్త బయటకు వదిలింది. ఆ కారు ప్రభాస్ బంధువుదని చెప్పింది. అంతేకాదు దీంతోపాటు ప్రభాస్ ఊళ్లో లేడని, విదేశాల్లో ఉన్నాడని కూడా అతని టీమ్ చెబుతోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘రాధేశ్యామ్’ సినిమా విడుదలైన వెంటనే ప్రభాస్ విదేశాలకు వెళ్లాడు. కొంతకాలంగా తనను వేధిస్తున్న గాయానికి అక్కడ సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత రెస్ట్ తీసుకొని, కొన్ని రోజులకు స్వదేశానికి వచ్చేశాడు. హైదరాబాద్‌లోనే ఉంటూ నెల రోజులు రెస్ట్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రభాస్ విదేశాలకు వెళ్లాడు అని టీమ్ చెబుతోంది. దీంతో మొన్నే కదా ప్రభాస్ వచ్చింది మళ్లీ వెళ్లడం ఏంటి అని అభిమానులు అడుగుతున్నారు. ప్రభాస్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
దేశంలో లేకపోతే ఎక్కడికి వెళ్లాడు? అసలు ఎందుకు వెళ్లాడు? అక్కడేం చేస్తున్నాడు? సినిమా షూటింగ్ కోసమా? ఇంకేమైనా సమస్యనా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. అయితే ఈ స్పందన చూసి ప్రభాస్ టీమ్ మరోసారి రియాక్ట్ అయింది. ప్రభాస్ బాగానే ఉన్నాడని వచ్చే నెల 1 నుండి ‘సలార్’ షూటింగ్‌లో పాల్గొంటాడని చెప్పింది. అయితే దీనిపై కచ్చిత సమాచారం ఇవ్వడం లేదు. ఎందుకంటే ‘కేజీయఫ్ 2’ విడుదల, విజయం, ప్రచారం పనిలో ఉన్నారు ప్రశాంత్ నీల్.
ఈ లెక్కన మే 1 నుండి ‘సలార్’ మొదలవుతుందని చెప్పలేం. ఆ మధ్య ఎప్పుడో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ కాస్త రెస్ట్ తీసుకొని తర్వాత సినిమా స్టార్ట్ చేస్తాం అని చెప్పినట్లు గుర్తు. ఆ లెక్కన మే 1 నుండి సినిమా ఉంటుందా? అని డౌట్. ఆ సినిమా సంగతి పక్కన పెట్టేద్దాం. అసలు ప్రభాస్ ఎక్కడికి, ఎందుకు వెళ్లినట్లు. ఆన్సర్ ప్లీజ్ ప్రభాస్ టీమ్.