సినిమా ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏవైనా స్పెషల్ న్యూస్ ఉందా? ఇలాంటి అప్‌డేట్స్ కోసం అభిమానులు వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇది కలకాలంగా జరుగుతున్న విషయమే. ఒకప్పుడు అయితే… వచ్చేంతవరకు వెయిట్ చేసేవారు. లేదంటే ఫ్యాన్ మెయిల్‌లో లెటర్లు రాసేవాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అప్‌డేట్ ఇవ్వండి బాబూ అంటూ ట్వీట్లు పెడుతున్నారు. కొందరు తుంటరోళ్లు అయితే… ట్వీట్లలో కాస్త ఘాటుగా మీమ్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఈ పరిస్థితి బ్యానర్లు, ధర్నాలు, నినాదాలు, నిరసనల వరకు వెళ్లిపోయింది.
గతంలో ఇలాంటి పరిస్థితిని ప్రభాస్ ఎదుర్కొంటే.. ఇప్పుడు (Allu Arjun) అల్లు అర్జున్ ఎదుర్కొంటున్ఆనడు. అవును మీరు చదివింది కరెక్టే. ‘పుష్ప 2’ సినిమా అప్‌డేట్ ఇవ్వండి బాబూ అంటూ.. ఏకంగా నిరనసలు చేసే పరిస్థితి వచ్చింది. బ్యానర్లతో వినూత్నంగా నిరసన చేపట్టారు బన్నీ ఫ్యాన్స్. ‘వేకప్ టీమ్ పుష్ప’ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను దేశవ్యాప్తంగా వీరలెవల్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమా అప్డేట్ ఇవ్వడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఇతర సినిమా బృందంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ట్విట్టర్ ట్రెండ్ కంటే ముందు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ‘పుష్ప అప్‌డేట్ కావాలి’ అంటూ బ్యానర్లు, స్లోగన్స్ కనిపించాయి. ఆఖరిగా ఫ్యాన్స్ ఎలా అడుగుతున్నారు అంటే… హీరోకి సంబంధించిన డేట్స్‌లో అప్‌డేట్ ఇవ్వడం లేదు. విలన్ పుట్టిన రోజుకైనా అప్‌డేట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. కొంత మంది అభిమానులు అయితే… వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారు. ట్వీట్ వార్‌లో పరుష పదాలు సహజమే అనుకుంటున్న ఈ రోజుల్లో ఆ పదాలు శ్రుతిమించుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో బన్నీ మేలుకోవాలి తొలుత అనే వాదనలూ వినిపిస్తున్నాయి.
ఇలాంటి మాస్ గేదరింగ్స్, అది కూడా వివిధ ప్రదేశాల్లో ఒకేసారి అసాధారణం అని చెప్పాలి. మరి ఎలా సాధ్యమైంది. దీని వెనుక ఎవరున్నారో అంటూ చిన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అప్‌డేట్స్ రాకపోవడానికి సినిమా ఇంకా సగం కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.