టాలీవుడ్లో కథలకు కొరత ఉందా? ఏమో మెగాస్టార్ చిరంజీవి వరుస చూస్తుంటే… ఉందేమో అనిపిస్తోంది. ‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్ చేయాలనుకుంటున్న సినిమాలన్నీ రీమేక్‌లు కావడమే దీనికి కారణం. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ కాస్త స్లోగా కనిపించారు. అయితే ‘ఆచార్య’ మొదలయ్యాక చిరు జోరు పెరిగింది. వరుసగా సినిమాలు ఓకే చేసేస్తున్నారు. అలా ‘లూసిఫర్’ రీమేక్, ‘వేదాళం’ రీమేక్ ప్రకటించారు. దీంతోపాటు బాబి డైరక్షన్‌లో ఓ సినిమా ప్రకటించారు. ఇది కూడా రీమేకే అని సమాచారం. ఇవి కాకుండా ‘ఎన్నై అరిందాళ్’ అనే అజిత్ సినిమాను కూడా రీమేక్ చేయాలని చూస్తున్నారని చాలా రోజులుగా వినిపిస్తోంది.
ఇలా చిరు సినిమాల లైనప్ చూస్తుంటే… అన్నీ రీమేక్‌లే కనిపిస్తున్నాయి. తెలుగు దర్శకుల దగ్గర కథలు లేకనా, లేక చిరంజీవికి ఆ కథలు నచ్చడం లేదో తెలియదు కానీ… వరుసగా రీమేక్‌లే చేస్తున్నాడు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారనే చెప్పొచ్చు. మంచి కథలు రాసే కుర్రాళ్లు మన దగ్గర ఉన్నారు. వారితో సినిమాలు చేయకుండా అక్కడి సినిమాలు ఇక్కడకు తెచ్చి చేయడం ఎందుకో అర్థం కావడం లేదు. అందులోనూ ‘ఎన్నై అరిందాళ్’ తెలుగులో ఇప్పటికే ‘ఎంతవాడు గానీ’ అనే పేరుతో వచ్చేసింది కూడా.
వేగంగా సినిమాలు చేసేయాలనే ఆలోచనతోనే చిరంజీవి రీమేక్‌లు ఎంచుకుంటున్నారనే మాట కూడా ఆ మధ్య వినిపించింది. ఒకవేళ ఇదే నిజమైతే… మన దగ్గర చాలామంది దర్శకులు, రచయితలు కథలతో సిద్ధంగా ఉన్నారని ఇంతకుముందే చెప్పుకున్నాం. చిరంజీవి ఓకే చెప్పాలి కానీ… వాళ్లు సిద్ధమైపోతారు. అలాంటిది చిరంజీవి రీమేక్‌ల ముచ్చట ఎందుకు ఇంకా కొనసాగుతోందో తెలియడం లేదు. అలా అని రీమేక్‌లు చేయకూడదు అని కాదు. కేవలం చిరంజీవి ఒక్కరే చేస్తున్నారని కాదు. కానీ ‘వై రీమేక్’ అనేదే ప్రశ్న.