టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి మన దర్శకనిర్మాతలు వెనకడుగు వేస్తుంటారు. దానికి కారణం డేట్స్ కుదరకపోవడం ఒకటైతే, రెండోది అభిమాను అంచనాల రచ్చ అని టాక్. దీనిపై ఎవరూ క్లారిటీగా చెప్పకపోయినా… కొన్నిసార్లు జరిగే అనవసరమైన చర్చ కారణంగా దర్శకనిర్మాతలు… ఆ మాటకొస్తే హీరోలు ముందుకురారు. ఈ మాటలకు ఊతమిచ్చేలా ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలో సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచి చేయని పరిస్థితి ఇది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ నుండి ఇటీవల 45 సెకన్ల వీడియో గ్లింప్స్ ఒకటి విడుదల చేశారు. భారతీయ సినిమా గర్వించేలా, మన సినిమా అంతర్జాతీయ వేదికపై వెలుగులీనేలా ఆ సినిమా రూపొందుతోందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ప్రచారానికి, టీమ్ బూస్టింగ్‌గా ఉండటానికి, అభిమానుల కళ్లలో ఆనందం చూడటానికి ఆ వీడియో సిద్ధం చేయించారు రాజమౌళి అండ్ టీమ్. అయితే నెటిజన్లు వేరేలా చూస్తున్నారు. గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో చూస్తే… ఈ సినిమాలో ఎన్టీఆర్ 30 నిమిషాలు ఉంటారట.
రామ్ చరణ్ పాత్ర చిన్నదట అంటూ పుకార్లు రేపుతున్నారు. ఏకంగా గ్లింప్స్‌లో మా హీరోకు తక్కువ సన్నివేశాలు ఉన్నాయంటూ కొత్తరకమైన చర్చ రేపుతున్నారు. మన తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై అదరగొట్టాల్సిన సమయంలో… అభిమానుల రూపంలో ఉన్న నెటిజన్లు ఇలా తక్కెడ వేసుకొని సన్నివేశాలు లెక్కించడం ఏ మాత్రం సరికాదని పరిశ్రమ పరిశీలకులు అంటున్నారు.