ఒకప్పుడు యంగ్ ప్రేమకథలు అంటే ఒకే రకం ఉండేవి. ప్రేమించడం, ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడం, లేచిపోయి పెళ్లి చేసుకోవడం, ఆఖరున తిరిగి ఇంటికి వచ్చేయండి. ఇలా ఇంటికొచ్చేస్తే హ్యాపీ ఎండింగ్. లేదంటే శాడ్ ఎండింగ్. మనం ఇలాంటి ప్రేమకథల్ని బయట చాలా చూసే ఉంటాం. సినిమాల్లో అయితే డబ్బున్న అమ్మాయి – పేద అబ్బాయి లేదంటే పేదమ్మాయి – డబ్బున్న అబ్బాయి. చాలా ఏళ్లు నడించింది ఈ ట్రెండ్. మధ్య తరగతి అమ్మాయి – మధ్య తరగతి అబ్బాయి లేదంటే పేదమ్మాయి – పేదబ్బాయి కథలు చాలా తక్కువే. ఇలాంటివి కౌంట్ వేయాలంటే వేళ్ల మీద లెక్కేట్టేయొచ్చు.
అయితే, ఇప్పుడు ఇలాంటి కథలకే టాలీవుడ్‌లో పెద్ద పీట వేస్తున్నారు. కావాలంటే మీరే చూడండి గత కొన్నేళ్లలో చిన్న సినిమాలుగా వచ్చి భారీ విజయం అందుకున్న వాటిలో ఇలాంటి ప్రేమకథలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని నిబ్బా నిబ్బి ప్రేమకథలు అంటూ ఓ ముద్దు పేరు కూడా పెట్టారు. అంటే మరీ యంగ్ ఏజ్‌లో అంటే పదో తరగతి నుండి డిగ్రీ వరకు అబ్బాయి – అమ్మాయి మధ్య పుట్టే ప్రేమ, ఆ తర్వాతి వ్యవహారాలే ఈ సినిమాల కథాంశాలు అవుతున్నాయి. ఇందులో కథ అందరూ ఊహించేదే ఉంటుంది. కానీ కథనం ఆసక్తికరంగా ఉంటుంది.
రీసెంట్‌గా వచ్చిన కంటెంట్ / సినిమాలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు పడీ పడీ చూస్తున్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’. తొలుత ఓటీటీ కోసం రెడీ అయిన ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఆ క్యూట్ ప్రేమకథకు మనోళ్లు కనెక్ట్ అయిపోయి భారీ వసూళ్లు అందిస్తున్నారు. అందులోని అమెచ్యూర్ లవ్ సీన్స్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతకుముందు వచ్చిన ‘బేబీ’ కూడా ఇదే పరిస్థితి. అందులోనూ అమెచ్యూర్ ప్రేమనే కనిపిస్తుంది. ఆ కథకైతే నేషనల్ అవార్డు వచ్చింది. మధ్యలో వచ్చిన ‘90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ కూడా ఇంతే.
మరికొన్ని ఈ తరహా కథలు వచ్చినా సరిగ్గా కనెక్ట్ చేయలేక ఆశించిన విజయం అందుకోలేదు. ఈ లెక్కన చెప్పొచ్చేది ఏంటంటే ఈ అమెచ్యూర్ ప్రేమకథలు ఇన్‌స్టంట్ హిట్ ఫార్ములా అయిపోయాయి. అయితే ఓవర్ డోస్ కాకుండా చూసుకుంటే మన ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు అని. ఇదంతా ఓకే కానీ ఎందుకు అందరూ కనెక్ట్ అవుతున్నారు అనేగా ప్రశ్న. నిన్నటి తరం యూత్‌కి అప్పట్లో మేమూ ఇలానే చేశామనే పీలింగ్. ఇప్పటితరం వారికి సిగ్గుపడి మనం ఇలాంటివి చేయలేకపోయాం.. చేసినోళ్లను చూద్దాం అనే ఫీలింగ్ కలగడమే అని చెప్పొచ్చు.