చిన్న సినిమా ప్రారంభం అయినా.. ఈ రోజుల్లో చాలా ఘనంగా చేస్తున్నారు. కానీ టాలీవుడ్‌లో ఓ నిర్మాణ సంస్థ మాత్రం సినిమా మొదలైన విషయం ఎవరికీ చెప్పడం లేదు. పెద్దగా ప్రచారం వద్దు అనుకుంటున్నారేమో అందుకే చెప్పడం లేదేమో అనుకుంటున్నారంతా. అయితే అలా చెప్పకపోవడం వెనుక పెద్ద కారణమే ఉంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆ నిర్మాణ సంస్థ పేరు మీకు ఇప్పటికే గుర్తొచ్చేసి ఉంటుంది. అవును మీరు అనుకున్నదే.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’.
టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఆధ్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ రన్ అవుతోంది. ఇప్పటికే 25 సినిమాలు నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున సినిమాలు నిర్మిస్తోంది. వచ్చే 18 నెలల్లో మరో 25 సినిమాలు నిర్మించాలని అనుకుంటోంది. అయితే సినిమాల నిర్మాణంలో అంత స్పీడుగా ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఆ సినిమాల విషయం చెప్పడానికి ఎందుకు ముందుకు రావడం లేదు. ఈ సంస్థలో సినిమా స్టార్ట్ అయ్యి.. అంతా పూర్తవుతున్న సమయంలో వివరాలు చెబుతుంటారు.
‘బ్రో’ సినిమా విషయంలో మాత్రమే సినిమా మొదలైనప్పటి నుండి వివరాలు బయటకు ఇస్తున్నారు. ప్రభాస్ – మారుతి సినిమా విషయంలో మాత్రం టీమ్ నుండి ఎలాంటి వివరాలు రావడం లేదు. సినిమా ఉందని, ఇలా ఉంటుందని, అలా ఉండొచ్చని పుకార్లు రావడం తప్ప.. ఎక్కడా అధికారికంగా అనౌన్స్‌మెంట్ రాలేదు. తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన టి.జి.విశ్వప్రసాద్ ఈ సినిమా గురించి విచిత్రంగా స్పందించారు. దీంతో అంత రహస్యం ఏంటి? అనే ప్రశ్న మొదలైంది.
ప్రభాస్ – మారుతి సినిమా మా బ్యానర్‌లో తెరకెక్కుతోంది… అయితే సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం అని విశ్వప్రసాద్ చెప్పారు. సినిమా ఉందని, షూటింగ్ అవుతోందని చెప్పి.. కనీస వివరాలు ఎందుకు చెప్పలేదు అనేది ప్రశ్నగా మారింది. శర్వానంద్ సినిమా కూడా ఒకటి ఇదే బ్యానర్‌లో రూపొందుతోంది. ఆ సినిమా వివరాలు కూడా బయటకు రాలేదు. దీంతో అసలు ఎందుకు చెప్పడం లేదు అనేదే ప్రశ్న.