సినిమా పరిశ్రమకు (Tollywood) అతి పెద్ద థ్రెట్ ఏదీ అంటే.. గత కొన్నేళ్లుగా పరిశ్రమ పెద్దలు, పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్లు చెప్పే మాట ‘పైరసీ’. ఇక్కడ మీరు ‘గత కొన్నేళ్లుగా’ అనే మాటను గుర్తుచుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ప్రస్తుతం పరిశ్రమలో కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటులు మరో విషయం గురించి చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. అదే మీడియా.. ప్రెస్. అంటే రివ్యూలు అన్నమాట.
అంటే సినిమా ఎలా ఉంది? అనే వివరాలను పాత్రికేయులు సినిమా చూసి చెబుతుంటారు. సినిమా గురించి తెలుసుకోవాలి అనుకునేవాళ్లు ఆ రివ్యూ చదివి సినిమాలకు వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ ఇప్పుడు కాదు ఐదు దశాబ్దాలుగా సాగుతోంది. రివ్యూలు రాసి ప్రముఖ పాత్రికేయులు అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. రివ్యూలే మా సినిమాను నిలబెట్టింది, మమ్మల్ని నిలబెట్టింది అని చెప్పిన నటులు, దర్శకనిర్మాతలు కూడా ఉన్నారు.
బాగున్న సినిమాను బాగుందని, బాగోలేని సినిమాను బాగోలేదని చెబుతుంటారు. అయితే కొంతమంది కావాలని సినిమా బాగోలేదని చెబుతున్నారు అని పరిశ్రమ వర్గాలు చాలా ఏళ్లుగా అంటున్నాయి. వారి విషయంలో చర్యలు, విజ్ఞప్తుల అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా మొత్తంగా రివ్యూలే వద్దు, మీడియాకు రివ్యూలకు ప్రవేశం వద్దు అంటున్నారు. సినిమా ఎలా ఉందో చెప్పే అధికారం ప్రెస్‌కు, మీడియాకు ఆపే అవకాశం ఎవరికి ఉంది. అయినా అదెలా సాధ్యం. ఒకవేళ ఆపినా సోషల్ మీడియా యుగంలో రివ్యూలు ఆగిపోతాయా?
సినిమా థియేటర్‌లో కూర్చొని వీడియోలు రికార్డు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు నెటిజన్లు. సినిమా అయిపోయాక బయటకు వచ్చి వీడియోల్లో రివ్యూలు చెబుతున్నారు. వాటిని ఆపడం ఎవరి తరమూ కాదు. అందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి అనేది చెప్పలేం. ఇలాంటి సమయంలో మీడియా మీద, సోషల్ మీడియా మీద పట్టింపులు, హూంకరింపులు సరికాదు అనే చెప్పాలి.
రివ్యూల వల్ల సినిమాలు నష్టపోవు, నష్టపోతాయి కాబట్టి ఆపేద్దాం అనుకుంటే.. అంతకుమించిన నష్టం పైరసీ వల్ల జరుగుతోంది. గతంలో కాస్త గట్టిగా పైరసీని వ్యతిరేకించిన పరిశ్రమ.. ఇప్పుడు అదొక రెగ్యులర్ అంశంలా వదిలేశారు. ‘గేమ్ ఛేంజర్’ (Game Chnager) , ‘తండేల్’ (Thandel) లాంటి పెద్ద నిర్మాతల సినిమాలు పైరసీకి గురైనా పరిశ్రమ నుండి ఆ స్థాయి రియాక్షన్ రాలేదు. టికెట్ రేట్ల విషయంలో పదే పదే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కలుస్తున్న మన సినిమా పెద్దలు పైరసీ గురించి ఈ మధ్య అలాంటి అడుగు వేసింది తక్కువే.
ఇక ఇంటి దొంగల బాధ ఎప్పటి నుండో ఉంది. సినిమా టీమ్‌లోని వాళ్లే పైరసీకి కారణమైన ఘటనలు చాలానే చూశాం కూడా. అంతెందుకు ‘గేమ్ ఛేంజర్’ సినిమా కథ, అందులోని ముఖ్యంశాలు, సన్నివేశాల వరుస, హెచ్‌డీ ప్రింట్ బయటకు వచ్చేశాయి. ఇవన్నీ ఇంటి దొంగల పనే అని ఇండస్ట్రీ టాక్. వాటి సంగతి సీరియస్‌గా తీసుకుంటే రివ్యూలు పెద్ద విషయమే కాదు. ఇదంతా చదివాక ‘గత కొన్నేళ్లుగా’ అనే పదం ఎందుకు వాడామో మీకు అర్థమయ్యే ఉంటుంది.