గత కొన్ని పర్యాయాలుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగినప్పుడల్లా కీలకంగా మారిన అంశం ‘మా’కు సొంత భవనం. ఇప్పుడు ఈ ఏడాది ఎన్నికల్లోనూ ఈ పాయింటు పట్టుకునే అందరూ బరిలో నిలుస్తున్నారు. దీనిని ‘మా’ సభ్యులు ఎంతవరకు సీరియస్‌గా తీసుకొని ఓటేస్తారు అనేది పక్కనపెడితే… అసలు ఈ అంశం ఈపాటికే తేలిపోయుండేది అని తెలుస్తోంది. ఈ పాటికి కొత్త భవనంలో ‘మా’ కార్యాలయం ఉండేదట. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) గుర్తుందా. మన సినిమా తారలందరూ కలసి క్రికెట్ ఆడేవారు.
అన్ని వుడ్‌లకు చెందిన వారిని ఒక దగ్గరకు చేర్చి లీగ్ నిర్వహించేవారు విష్ణు ఇందూరి. కొన్నేళ్లపాటు ఆయన ఈ అన్‌బిలీవబుల్ ఫీట్ చేసి చూపించారు. స్టార్ హీరోలందరూ ఆడితే… బెంగళూరు ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సొంత బిల్డింగ్ కట్టిస్తా అని విష్ణు అన్నారట. అందుకు తగ్గట్టే వాళ్లు ఆడి… బెంగళూరులో ఓ భవనం సాధించారు. నిజానికి ఇది టాలీవుడ్‌కి కూడా జరిగి ఉండాల్సిందట. కన్నడ పరిశ్రమ కంటే ముందే విష్ణు ఇందూరి ఈ ప్రపోజల్‌ను టాలీవుడ్ హీరోల ముందు ఉంచాడని అంటుంటారు.
దీంట్లో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ… ఈ పాయింట్ ఇప్పుడు చర్చల్లో నిలుస్తోంది. తెలుగు యంగ్ స్టార్ హీరోలు మ్యాచ్‌లు ఆడటానికి ముందుకొస్తే… ‘మా’ భవనం కట్టిస్తా అని విష్ణు అన్నారట. కానీ ఏమైందో కానీ ఆ తర్వాత ఆ ముచ్చటే వినిపించలేదు. మన వాళ్లు ఎందుకు ఆడలేదు అనేది తెలియడం లేదు. భవనం మాత్రం రాలేదు.