మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ మ్యాగ్జిమమ్ ఫిక్స్ అయ్యింది. సెప్టెంబరు 12న ఎన్నికల నిర్వహించాలని ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. మరోవైపు పోటీలో ఉండేదెవరు అనేది ఎప్పుడో తేలిపోయింది. ప్రకాశ్‌రాజ్, విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు ఇప్పటికే పోటీ గురించి చెప్పారు. అయితే ఇప్పుడున్న ప్రశ్న ‘పెద్దలు చేద్దామంటున్న ఏకగ్రీవం’ ఏమైంది. ‘మా’ ఏకగ్రీవం గురించి టాలీవుడ్‌లో చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.
‘అదే దాసరి గారు ఉండుంటేనా..’ అనే మాట తప్పించుకోవడానికో, పెద్దరికం చూపించడానికో తెలియదు కానీ కొంతమంది టాలీవుడ్ పెద్దలు ఏకగ్రీవ రాగం అందుకున్నారు. దీంతోపాటు ‘తొలి మహిళా అధ్యక్షురాలు’ అనే పాట కూడా అందుకుంటున్నారు. వాళ్లు పోటీలో ఉన్నప్పుడు గుర్తు రాని ఈ రాగాలు, పాటలు ఇప్పుడు గుర్తు రావడం విశేషం.ఈ రెండింటిలో ఏది చేయాలన్నా… చిరంజీవి కచ్చితంగా మాట తప్పాలి. ఎందుకంటే ప్రకాశ్ ప్యానల్‌కు చిరంజీవి ఎప్పుడో మద్దతు తెలిపేశారు.
ఇప్పుడు ఆయననే ఏకగ్రీవం చేస్తే ఎలాంటి సమస్య లేదు. అలా కాకుండా వేరే ఎవరినైనా ఏకగ్రీవం చేయాలన్నా, మహిళా అధ్యక్షురాలు రావాలన్నా… చిరు మాట తప్పాల్సిందే. లేదంటే ప్రకాశ్‌రాజ్‌ను ఈసారికి ఒప్పించి వేరొకరికి ఇస్తారా అనేది చూడాలి.