స్టార్ గా ఓ స్థాయికి చేరినప్పటి నుండి చిరంజీవి సామాజిక కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు. ఆయన ఏళ్ల క్రితమే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు స్థాపించి, ఆపద సమయంలో అర్హులైన వారికి సాయం అందేలా చేస్తున్నారు. ఇక కొన్ని రోజులుగా కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. అన్ని పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీనితో చిత్ర పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఇక్కట్ల పాలవుతున్నారు.
వీరి సమస్యలు తీర్చడం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో ఓ సంస్థను స్థాపించి విరాళాలు భారీగా సేకరించారు. చిత్ర ప్రముఖుల నుండి విశేష స్పందన ఈ కార్యక్రమం దక్కించుకుంది. అంతా బాగానే ఉంది కానీ..అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. సేకరించిన విరాళాలు, వాటి వలన చేకూరే ప్రయోజనం అర్హులకు చేరుతుందా అనేది అసలు ప్రశ్న. చిత్ర పరిశ్రమ పూర్తిగా సంఘటితంగా లేదు. ఏళ్లుగా చిత్ర పరిశ్రమకు సేవ చేస్తున్న అనేక మంది కార్మికులకు కనీస గుర్తింపు కార్డులు లేవు అనేది సత్యం.
ఇక్కడ ప్రముఖులు కూడా ఆయా శాఖలకు చెందిన పెద్దలను పిలిచి వారు ఇచ్చిన సమాచారం ప్రాదిపదికన, విరాళాలు పంచే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ సంఘాల పెద్దలు క్షేత్ర స్థాయిలో అర్హులైన పేదల వరకు ఆ ప్రయోజనాలు తీసుకెళతారా అంటే అనుమానమే. కాబట్టి ఈ చారిటీ బాధ్యలు తీసుకున్న చిరంజీవి మరియు పెద్దలు అర్హులైన పేదలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకొని, పర్యవేక్షించినప్పుడే వారి ఆశయం పూర్తవుతుంది.