తెలుగు సినిమాల నటీనటుల సంఘం అదేనండీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం గురించి ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. రెండళ్ల క్రితం ‘మా’ ఎన్నికలు జరిగినప్పుడు ‘మా’ భవనంతోపాటు ఈ విషయం కూడా చర్చలోకి వచ్చింది. ‘మా’ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంటేనే తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఉండాలి, లేదంటే తెలుగు సినిమాల్లో నటించాలి అంటే ‘మా’ మెంబర్ అయి ఉండాలి అని ఓ చర్చ చాలా ఏళ్లుగా నడవడం కూడా మనం చూశాం.
ఇప్పుడు ఇదే టాపిక్ మళ్లీ మొదలైంది. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లకు ‘మా’ మెంబర్‌షిప్ ఉండాలని ఎవరూ అనడం లేదు. అయితే ‘మా’ మెంబర్ అవ్వడానికి అవసరమైన అన్ని అర్హతలు వచ్చాక కచ్చితంగా మెంబర్‌షిప్ తీసుకోవాలి. కానీ కొంతమంది నటీనటులు ఈ విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదు. లైఫ్ మెంబర్‌షిప్‌కి సుమారు రూ. లక్ష అవసరం. అది కట్టడానికి కూడా కొంతమంది ముందుకు రావడం లేదు.
ఇలా జరగడం వల్లే పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) వర్సెస్ రక్షణ టీమ్ గొడవ నిర్మాతల మండలికి, సోషల్ మీడియాకి చేరింది అని చెప్పాలి. ఆ సినిమా ప్రచారానికి పాయల్ రాను అంటోంది అని సినిమా టీమ్ ‘మా’ మెట్లు ఎక్కగా.. ‘మా’ మెంబర్ కాదు కాబట్టి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్మాత ఇప్పుడు నిర్మాతల మండలికి వచ్చారు. అదే ఆమె ‘మా’ మెంబర్‌షిప్ తీసుకొని ఉంటే అక్కడే తేలేది.
గతంలో అంటే ‘మా’ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్‌మీట్‌లలో ‘మా’ మెంబర్‌షిప్ గురించి స్ట్రిక్ రూల్స్ పెట్టాం అని చెప్పారు. మెంబర్‌షిప్ లేనివాళ్లు సినిమాల్లోకి వద్దు అని ఛాంబర్‌కు సూచిస్తాం అని కూడా అన్నట్లు గుర్తు. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ ఇష్యూ మూలాన ‘సభ్యత్వం’ విషయం చర్చకు వచ్చింది. ఇప్పటికైనా ఈ విషయంలో ‘మా’ ముందుడగు వేయాలి. సమస్యలు పరిష్కారం కావాలి.