ఒకప్పుడు సినిమా (Movies) గొప్పతనం గురించి చెప్పాలి అంటే.. పలానా సినిమా.. ఇన్ని రోజులు ఆడింది, ఇన్ని కేంద్రాల్లో ఆడింది అంటూ చెప్పేవారు. పోస్టర్లలో కూడా అదే ఇన్ఫో ఉండేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా టాక్ బాగుంటే తప్ప 4 వారాలు థియేటర్లలో నిలబడని పరిస్థితి. అందుకే ఆ సినిమా గొప్పతనం గురించి చెప్పడానికి.. పోస్టర్లపై ఫేక్ కలెక్షన్స్ నంబర్స్ వేసి చెప్పాల్సి వస్తుంది. నిజమైన డిస్ట్రిబ్యూటర్ కి.. నిర్మాతకి తప్ప ఎవరికీ తెలియదు.
Movies
డిస్ట్రిబ్యూటర్ కూడా నిర్మాతకి ఒరిజినల్ నెంబర్ చెబుతాడు అనే గ్యారెంటీ లేదు. అందుకే డిస్ట్రిబ్యూటర్ చెప్పిన నెంబర్ కి మరో 15 , 20 శాతం యాడ్ చేసి పోస్టర్ వదులుతారు. ఇవి నిజమే అనుకుని ఫ్యాన్స్ మురిసిపోతారు. యాంటీ ఫ్యాన్స్ అయితే ‘ఫేక్’ అంటూ మాటల యుద్దానికి దిగుతారు. చివరికి ఇది నిర్మాతలపై ఐటీ రైడ్స్ జరిగే రేంజ్ కి వెళ్తుంది. దిల్ రాజు (Dil Raju) , మైత్రి వారిపై కొన్ని రోజులుగా జరుగుతున్న ఐటీ రైడ్స్ గురించి అందరికీ తెలిసిందే.
పోస్టర్లపై వేసిన నెంబర్ గురించి ఆరా తీసి అసలైన లెక్కలు చెప్పాలని కూడా ఐటీ అధికారులు డిమాండ్ చేశారు. పోస్టర్ పై వేసిన నెంబర్ కి తగ్గట్టు జీఎస్టీ ఎందుకు కట్టలేదు అంటూ ప్రశ్నించారు. అవి హైప్ కోసం వేసిన నెంబర్స్ అని చెప్పినా వాళ్ళు వినలేదు. దీంతో చాలా ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు. రాజమౌళి (S. S. Rajamouli) తన సినిమాల కలెక్షన్స్ పోస్టర్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
‘ఆల్ టైం రికార్డు’ వంటి పదాలు ఉండకూడదు అని తన టీంకి చెబుతారు. ఎన్ని టిక్కెట్లు తెగాయి అనే విషయంపైనే రాజమౌళి దృష్టి పెడుతూ ఉంటారు. ఇలా మిగతా దర్శక నిర్మాతలు కూడా ఆలోచించాలి. అప్పుడే ఫ్యాన్ వార్స్ వంటివి తగ్గుతాయి. డైరెక్టర్స్ కూడా ప్రెజర్ లేకుండా సినిమాని తీయగలుగుతారు. లేదు అంటే ఇలాగే ఫేక్ పోస్టర్స్ వేసుకుని మరీ ఐటీ వాళ్ళ చేతిలో నిర్మాతలు నలిగిపోవాల్సి ఉంటుంది.