2003 లో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘సింహాద్రి’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు ఎన్టీఆర్. అప్పట్లో 100 రోజులు, సెంటర్లు అనే విషయాల్ని పరిగణలోకి తీసుకునేవారు కాబట్టి ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. లేదంటే ఇప్పుడు కలెక్షన్స్ ప్రక్రియని తీసుకుంటే ‘సింహాద్రి’ కూడా ఇండస్ట్రీ హిట్ అని చెప్పలేం. ఇక ఆ చిత్రం తర్వాత దాదాపు 3 ఏళ్ళ వరకూ ఎన్టీఆర్ హిట్టందుకోలేదు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘యమదొంగ’ చిత్రంతోనే మళ్ళీ హిట్టందుకున్నాడు. అయితే ఆ చిత్రం కూడా ఇండస్ట్రీ అవుతుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక అప్పటినుండీ.. ఇప్పటి వరకూ ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కాదు కదా బ్లాక్ బస్టర్లు కూడా కొట్టలేకపోతున్నాయి. ఒక్క ‘జనతా గ్యారేజ్’ మాత్రమే బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఎన్టీఆర్ తోటి హీరోలైన రాంచరణ్ ఇప్పటికే ‘మగధీర’ ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు, ఇక మహేష్ బాబు ‘పోకిరి’ ‘శ్రీమంతుడు’ వంటి ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. పవన్ కళ్యాణ్ అయితే ‘ఖుషి’ ‘అత్తారింటికి దారేది’ అంటూ మూడు ఇండస్ట్రీ హిట్లందుకున్నాడు. అల్లు అర్జున్ మాత్రం ఇంకా ఎటువంటి ఇండస్ట్రీ హిట్ అందుకోలేదు. ఇదిలా ఉంటే ఈసారి రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు కాబట్టి ఈసారైనా ఇండస్ట్రీ హిట్టందుకుంటాడేమో చూడాలి అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అయితే రాజమౌళి డైరెక్షన్లో ఇండస్ట్రీ కొట్టినా.. అది రాజమౌళి అకౌంట్ లోకే వేసేస్తారు ప్రేక్షకులు. అలా అనుకుంటే ప్రభాస్ కి కూడా రెండు ఇండస్ట్రీ హిట్లు ఉన్నట్టే కదా అని కూడా కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.