దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వం చేయకుండా ఏ సినిమాకి రైటింగ్ బాధ్యతలు తీసుకున్నా ఆయన డామినేషన్ కనిపిస్తుంటుంది. తన రచనతో త్రివిక్రమ్ వేసే మార్క్ అలాంటిది. కేవలం రచయితగా ఉన్న రోజుల్లో ‘స్వయంవరం’, ‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ లాంటి సినిమాల్లో త్రివిక్రమ్ ఎంతగా మెప్పించాడో తెలిసిందే. ఆ సినిమాకి వేరే దర్శకుడైనా.. త్రివిక్రమ్ కే ఎక్కువ పేరొచ్చింది. ‘నువ్వే నువ్వే’తో దర్శకుడిగా మారిన తరువాత వేరే సినిమాలకు రైటర్ గా పని చేయడం తగ్గించారు త్రివిక్రమ్.
కానీ మధ్యమధ్యలో పవన్ కళ్యాణ్ కోసం కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ బాధ్యతలు తీసుకున్నారు. వాటిలో అన్నీ దాదాపు రీమేక్ సినిమాలే. ‘తీన్ మార్’ సినిమాకి స్క్రిప్ట్ రైటర్ గా త్రివిక్రమే వర్క్ చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ సమయంలో కూడా దర్శకుడు జయంత్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రీసెంట్ గా విడుదలైన ‘భీమ్లానాయక్’ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ కే దక్కింది.
దర్శకుడు సాగర్ చంద్రకు గుర్తింపు రాలేదు. మేకింగ్ పరంగా దర్శకుడు కష్టపడినప్పటికీ.. డైలాగ్స్, కథలో మార్పులు చేసి మేజర్ క్రెడిట్ త్రివిక్రమ్ కొట్టేశారు. ఇప్పుడు త్రివిక్రమ్.. పవన్ చేయబోయే మరో సినిమాకి స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు. తమిళ సినిమా ‘వినోదయ సీతమ్’కు ఇది రీమేక్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి రంగం సిద్ధం చేయబోతున్నారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన దర్శకుడు సముద్రఖని.. రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. మాతృకలో సముద్రఖని ఓ రోల్ కూడా ప్లే చేశారు. ఇప్పుడు ఆ పాత్రను పవన్ కళ్యాణ్ పోషించనున్నారు.
ఈ రీమేక్ కి సముద్రఖని దర్శకుడు అయినప్పటికీ.. ఒరిజినల్ స్క్రిప్ట్ కు త్రివిక్రమ్ మార్పులు, చేర్పులు చేసి డైలాగ్స్ రాశాడని చెబుతున్నారు. ఇంతకముందు అంటే త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇచ్చిన రీమేక్ సినిమాలకు ఫామ్ లో లేని దర్శకులు పని చేశారు కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు సముద్రఖని లాంటి పేరున్న దర్శకుడు త్రివిక్రమ్ డామినేషన్ ను తట్టుకోగలడా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తే సముద్రఖని ఒప్పుకొని ప్రాజెక్ట్ ముందుకు నడిపిస్తారా..? అనేది సందేహమే.