“డియర్ కామ్రేడ్” డిజాస్టర్ అనంతరం విజయ్ దేవరకొండ చిన్నపాటి విరామం తీసుకొని విడుదల చేస్తున్న సినిమా “వరల్డ్ ఫేమస్ లవర్”. సునిశిత చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సరసన నలుగురు కథానాయికలు నటించడం విశేషం. టీజర్, ట్రైలర్ తోనే విపరీతమైన అంచనాలు నమోదయ్యేలా చేసిన ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 14) విడుదలైంది. మరి ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..!!
కథ: సినిమా పోస్టర్స్ రిలీజ్ అయినప్పట్నుంచి అందరి డౌట్ ఒకటే.. ఈ సినిమాలో విజయ్ నాలుగు క్యారెక్టర్స్ పోషించాడా? లేక ఒకే క్యారెక్టర్లో నాలుగు డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయా? అని. అయితే.. “వరల్డ్ ఫేమస్ లవర్”లో విజయ్ పోషించిన పాత్ర ఈ రెండిటిలా కాక ఇంకాస్త వైవిధ్యంగా ఉంటుంది.
ఇక కథలోకి వెళ్తే… రైటర్ కావాలనే ప్యాషన్ కోసం ఉద్యోగం వదిలేసి తాను ప్రేమించిన యామిని (రాశీఖన్నా)తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటాడు గౌతమ్ (విజయ్ దేవరకొండ). మొదట్లో గౌతమ్ రైటర్ గా ఏదైనా సాధిస్తాడనే నమ్మకంతో అతడ్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన యామిని.. ఏడాదిన్నరపాటు అతడు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం, సినిమాలు చూడడం, తన కామాగ్ని చల్లార్చుకోవడం కోసం తన దేహాన్ని వాడుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని భావించిన యామిని గౌతమ్ కి బ్రేకప్ చెబుతుంది.
ఆ క్రమంలో గౌతమ్ మైండ్ లో ఓ రెండు కొత్త కథలు రూపాంతరం చెందుతాయి. అవే శీనయ్య-సువర్ణల పెళ్లి-ప్రేమకథ & గౌతమ్ & ఇజా లవ్ క్రష్-లవ్ స్టోరీ.
గౌతమ్ – యామిని జీవితాలకు శీనయ్య-సువర్ణ, శీనయ్య-స్మిత, గౌతమ్-ఇజాల ప్రేమ కథలకు ఏమిటి సంబంధం? అనేది తెలియాలంటే “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: సినిమా ఓపెనింగ్ సీన్ నుండి విజయ్ “అర్జున్ రెడ్డి”ని తలపిస్తూనే ఉంటాడు. అది గెటప్, గెడ్డం వాళ్ళ కావచ్చు లేక ఆ యాటిట్యూడ్ వల్ల కావచ్చు. అందువల్ల విజయ్ అర్జెంట్ గా ఆ ఫార్మాట్ నుండి బయటకు రావాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే జనాలకు బోర్ కొట్టేసే అవకాశం ఉంది. “అర్జున్ రెడ్డి” తర్వాత “గీత గోవిందం” సినిమా జనాలను ఎక్కవగా ఆకట్టుకోవడానికి కారణం విజయ్ చూపించిన వేరియేషన్. ఈ సినిమాలో విజయ్ నటుడిగా వైవిధ్యం చూపిన క్యారెక్టర్ “శీనయ్య”, ప్రెజంట్ జనరేషన్ యువత చాలా బాగా కనెక్ట్ అయ్యే పాత్ర ఇది. ఇక గౌతమ్ గా విజయ్ యాటిట్యూడ్ కొత్తగా ఏమీ అనిపించదు, కనిపించదు.
నలుగురు నటీమణుల్లో నటనతో ఆకట్టుకున్న అమ్మాయి ఐశ్వర్య రాజేష్. ఆమె కళ్ళ వెంబడి నీళ్లొస్తుంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల కంట్లో నీళ్లు తిరుగుతుంటాయి. సువర్ణ అనే సాధారణ గృహిణి పాత్రకు ఐశ్వర్య రాజేష్ ప్రాణం పోసింది. చివర్లో శీనయ్యను హత్తుకొని “నన్నొదిలేయకయ్యా శీనయ్యా” అని ఏడ్చే సన్నివేశం అందరి హృదయాలకు హత్తుకుంటుంది.
యామినిగా రాశిఖన్నా, స్మితగా కేథరీన్, ఇజా పాత్రలో ఇజాబెల్లె ఆకట్టుకున్నారు. ప్రియదర్శి ఫ్రెండ్ రోల్ రెగ్యులర్ గానే ఉంది.
సాంకేతికవర్గం పనితీరు: ఈ తరహా చిత్రాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ కంపల్సరీ. కానీ.. “వరల్డ్ ఫేమస్ లవర్”లో అదే లేకుండా పోయింది. “బొగ్గు గనుల్లో” అనే పాట మినహా ఏ ఒక్కటీ ట్యూన్ పరంగాకానీ.. పిక్చరైజేషన్ పరంగా కానీ ఆకట్టుకోలేకపోయింది. సో పాటల విషయంలో నిరాశపరిచిన గోపీసుందర్ నేపధ్య సంగీతంతో మాత్రం ఫర్వాలేదనిపించుకున్నాడు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ వర్క్ ప్రొడక్షన్ వేల్యూస్ ఎలివేట్ చేసింది కానీ.. ఎమోషనల్ ఎలివేషన్స్ ను సరిగా తెరపై చూపలేకపోయింది. నిర్మాణ విలువల విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.
దర్శకుడు క్రాంతిమాధవ్ రాసుకున్న కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ ను ఆడియన్స్ కు అర్ధమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాడు. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరున్న క్రాంతిమాధవ్ సెన్సిబిలిటీస్ తోపాటు కథా గమనం మీద కూడా ధ్యాస పెడితే బాగుండేది. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నప్పటికీ.. వాటిని పొందుపరిచిన విధానం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. పైగా.. సెకండాఫ్ లో వచ్చే గౌతమ్-ఇజాల ప్రేమకథ మరీ సహజత్వానికి దూరంగా ఉండడంతో ఆ పాత్రలకు, ఆ స్టోరీకి జనాలు అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేరు. సినిమాలో హాస్యం పాళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి.
అర్జున్ రెడ్డి లాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీలో కూడా కావాల్సినంత హాస్యం పండించగలిగాడు సందీప్ రెడ్డి, అటువంటి సందీప్ కి గురువులాంటి (క్రాంతి మాధవ్ దగ్గర “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” సినిమాకి అసిస్టెంట్ గా వర్క్ చేసాడు సందీప్ రెడ్డి) క్రాంతి మాత్రం ఎందుకో హాస్య రసాన్ని పెద్దగా వాడుకోలేదు. అయితే.. శీనయ్య-సువర్ణల ప్రేమను మాత్రం చాలా హృద్యంగా చూపించాడు. సినిమా మొత్తంలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే ఇదే. విజయ్ లాంటి నటుడు దొరికినప్పుడు అతడి ఇమేజ్ ను మాత్రమే కాక అతడిలోని నటుడ్ని కొత్త డైమెన్షన్ ను కూడా వాడుకొనే ప్రయత్నం చేయాలి దర్శకులు. లేదంటే విజయ్ సిక్స్ కొడదామని ఎంత గట్టిగా ప్రయత్నించినా బాల్ క్రీజ్ లోపలే ఉండిపోతుంది.
విశ్లేషణ: ట్రైలర్ చూసి సినిమాలో ఏదో ఉంటుంది అని ఊహించి థియేటర్లకు వెళ్తే మాత్రం పూర్తిస్థాయిలో నిరాశ చెందే చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”. విజయ్ మీద విపరీతమైన అభిమానం, ఓపిక, సహనం ఉంటేనే ఈ ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడిని పూర్తిగా చూడగలరు, లేదంటే మీ ఇష్టం.