అభిమాన నటి/నటుడు కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి వెళ్తున్న వారిని ఇటీవల మనం చూస్తున్నాం. సోనూ సూద్ కోసం ఓ కుర్రాడు ఏకంగా ముంబయి వరకు కాలినడకన వెళ్లాడు. ఇప్పుడు రష్మిక మందన కోసం మరో కుర్రాడు 900 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె సొంతూరు చేరుకున్నాడు. అయితే అతను పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. దీంతో నిరాశగా వెనుదిరిగాడతను. ఇంతకీ ఏమైందంటే… తెలంగాణకు చెందిన ఆకాశ్ త్రిపాఠి అనే కుర్రాడికి రష్మిక మందన అంటే చాలా ఇష్టం.
కొన్నిరోజుల నుండి ఆమెను కలవాలని అనుకుంటున్నాడు. అయితే కరోనా – లాక్‌డౌన్ వల్ల ఆగుతూ వచ్చాడు. తాజాగా రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తేయడంతో రైలులో మైసూరు వరకు చేరుకున్నాడు. అక్కడి నుండి రష్మిక కుటుంబం ఉండే కూర్గ్ జిల్లాలోని విరాజ్‌పేటకు వెళ్లాడు. రష్మిక ఇంటికి ఎలా వెళ్లాలని వాకబు చేస్తూ, అదే ప్రాంతంలో కొన్ని రోజులు గడిపాడు. దీంతో స్థానికులు ఆకాశ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. అతడిని తిరిగి సొంతూరుకు పంపించేశారు.
రష్మిక విరాజ్‌పేటలోనే ఉండుంటే… కలిసే అవకాశం ఉండేదేమో. కానీ ఇప్పుడామో ముంబయికి మకాం మార్చేసింది. ఆ విషయం తెలియక ఆకాశ్ అంత దూరం వెళ్లి నిరాశపడ్డాడు. అయినా అభిమాన నటిని చూడటానికి అంత దూరం వెళ్లాడు అంటే అభిమాన ఎంతపాటిదో తెలుసుకోవచ్చు. అయితే ఇలాంటి ప్రయత్నాలు ఏమంత మంచివి కావు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం మంచింది.