సంక్రాంతి పండుగ అంటే సినిమాల పండుగలా ఇండస్ట్రీ భావిస్తుంది. ఈ సీజన్లో ప్రేక్షకులు సినిమాలు ఎక్కువగా చూస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్ కి రావాలంటే.. ఒకటి ఆ సినిమాకి హిట్ టాక్ రావాలి లేదు అంటే ఆ సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్, ముఖ్యంగా సంక్రాంతి పండుగ వాతావరణాన్ని రిప్రజెంట్ చేసే ఎలిమెంట్స్ అయినా ఉండాలి. ఈ విషయం అందరికీ ఎలా ఉన్నా.. విక్టరీ వెంకటేష్ కి కచ్చితంగా తెలిసుండాలి.
2001 సంక్రాంతికి వెంకటేష్ నటించిన ‘దేవీపుత్రుడు’ సినిమా రిలీజ్ అయ్యింది. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఎందుకంటే ఆ సినిమా సంక్రాంతి పండుగకి తగ్గ సినిమా కాదు. ‘దేవీపుత్రుడు’ దెబ్బకి నిర్మాత యం.యస్.రాజు చాలా నష్టపోయారు. దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన ఆ సినిమా బాగోదు అని కాదు. దాని సబ్జెక్ట్ చాలా మంచిది. కాకపోతే అది పండుగ సినిమా కాదు. 2000 లో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘కలిసుందాం రా’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎందుకంటే అందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్.. సంక్రాంతి సీజన్ కి తగ్గ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
సో 2001 తర్వాత వెంకటేష్ ‘దేవీపుత్రుడు’ లాంటి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేయలేదు. 2006 లో వచ్చిన ‘లక్ష్మీ’ 2010 లో వచ్చిన ‘నమో వెంకటేశ’ 2012 లో వచ్చిన ‘బాడీ గార్డ్’ 2013 లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ , 2015 లో వచ్చిన ‘గోపాల గోపాల’ , 2019 లో వచ్చిన ‘ఎఫ్ 2’ వంటి సినిమాలను గమనిస్తే అవి ప్రయోగాత్మక సినిమాలు అనలేం. సంక్రాంతి పేరు చెప్పుకుని అన్నీ ఆడేశాయి. అందుకు తగ్గట్టే ఆ సినిమాల కంటెంట్ ఉంటుంది.
కానీ మళ్ళీ 23 ఏళ్ళ తర్వాత అంటే 2024 లో (Venkatesh) వెంకటేష్ ‘దేవీపుత్రుడు’ కి చేసిన తప్పే చేశారు. ఈ సంక్రాంతికి ‘సైంధవ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు. పోనీ టాక్ ఏమైనా బాగుందా అంటే అదీ లేదు. అందుకే ఈ సినిమాకి మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. అన్నీ ఎలా ఉన్నా ఇది వెంకటేష్ కి 75 వ సినిమా..! అంటే అతని ల్యాండ్ మార్క్ మూవీ. అదే అభిమానులను ఎక్కువగా బాధిస్తోంది అని చెప్పాలి.